రామ్ చరణ్‌ను మిస్ అవుతోన్న ‘ఖైదీ’ టీమ్!
Published on Nov 15, 2016 9:31 am IST

ram-charan
మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తోన్న ‘ఖైదీ నెం. 150’ తెలుగు సినీ పరిశ్రమలో ఇప్పుడొక హాట్‌టాపిక్ అన్నది ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. చాలాకాలం తర్వాత చిరు రీ ఎంట్రీ ఇస్తూ ఉండడం, ఆయనికిది 150వ సినిమా కావడం.. ఇలా ఎన్నో ప్రత్యేకతలతో ‘ఖైదీ నెం. 150’ తెరకెక్కుతోంది. ఇక ఈ సినిమాను ప్రతిష్టాత్మకంగా భావించిన చిరు తనయుడు రామ్ చరణ్ కూడా తానే స్వయంగా నిర్మిస్తూ, అన్నీ దగ్గరుండి చూసుకుంటూ వస్తున్నారు. ఇక ఇప్పటివరకూ ఖైదీ ప్రతి షెడ్యూల్‌లో వీలైనంతవరకూ పాల్గొంటూ వస్తోన్న చరణ్, యూరప్‌లో జరుగుతోన్న తాజా షెడ్యూల్‌కు మాత్రం వెళ్ళలేకపోయారు.

తాను హీరోగా నటిస్తోన్న ‘ధృవ’ షూట్‌లో బిజీగా ఉండడంతో క్రోటియాలో ప్రస్తుతం జరుగుతోన్న ఖైదీ నెం. 150కి సంబంధించిన పాట షూట్‌ను రామ్ చరణ్ మిస్ చేశారు. ఇక రామ్ చరణ్ లేకపోవడంతో అతడ్ని టీమ్ అంతా చాలా మిస్ అవుతోందని, చరణ్ ఉంటే సెట్‌లో ఒక ఎనర్జిటిక్ వాతావరణం ఉంటుందని, ఈ సినిమాకు కాస్ట్యూమ్ డిజైనర్‌గా పనిచేస్తోన్న చరణ్ అక్క సుష్మిత అన్నారు. చిరంజీవి, కాజల్‌లపై తెరకెక్కుతోన్న ఈ పాట చాలా బాగా వస్తోందని ఆమె ఈ సందర్భంగా తెలిపారు. వీవీ వినాయక్ దర్శకత్వంలో రూపొందుతోన్న ‘ఖైదీ నెం. 150’ సంక్రాంతి కానుకగా జనవరి నెలలో ప్రేక్షకుల ముందుకు రానుంది.

 
Like us on Facebook