‘ఖైదీ నెం. 150’ టీజర్ రిలీజ్‌కు రెడీ!

5th, December 2016 - 10:12:59 AM

khaidi150
మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తోన్న 150వ సినిమా ‘ఖైదీ నెం. 150’ ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే. చాలాకాలం తర్వాత చిరు రీ ఎంట్రీ ఇస్తోండడం, ఆయనకిది 150వ సినిమా కావడం లాంటి అంశాలతో ఖైదీ నెం. 150 మొదట్నుంచీ విపరీతమైన ఆసక్తి రేకెత్తిస్తూ వస్తోంది. ఇక ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ మొత్తం దాదాపుగా పూర్తైంది. దీంతో టీమ్ ఓ చిన్న టీజర్‌తో సినిమా అసలు కథను పరిచయం చేసే ఆలోచన ముందుకు తెచ్చింది.

డిసెంబర్ 8న ఈ ఫస్ట్ టీజర్‌ను విడుదల చేయనున్నారట. ఇప్పటికే విడుదలైన పోస్టర్స్ చిరంజీవి హీరోగా ఉన్న రోజులను గుర్తు చేస్తూ ఆయన అభిమానులకు ఉత్సాహాన్నిస్తోంది. ఇప్పుడు కొత్తగా టీజర్ విడుదలవుతూ ఉండడంతో, ఆ టీజర్ ఎలా ఉంటుందో అని అభిమానులంతా ఎదురుచూస్తున్నారు. భారీ బడ్జెట్‌తో చిరంజీవి తనయుడు రామ్ చరణ్ నిర్మిస్తోన్న ఈ సినిమా చిరు అభిమానులకు పండగ తెచ్చిపెడుతుందన్న ప్రచారం జరుగుతోంది. జనవరి నెలలో సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వస్తోన్న ఈ సినిమాకు వీవీ వినాయక్ దర్శకత్వం వహిస్తున్నారు. మురుగదాస్ దర్శకత్వంలో తెరకెక్కిన తమిళ సినిమా ‘కత్తి’కి రీమేకే ఈ ‘ఖైదీ నెం. 150’!