రూ. 100 కోట్ల షేర్ ను టచ్ చేసిన మెగాస్టార్ !


మెగాస్టార్ చిరంజీవి తన స్టామినా, స్టార్ డమ్ ఏమాత్రం తగ్గలేదని మరోసారి లెక్కలతో సహా నిరూపించాడు. ఆయన నటించిన 150వ చిత్రం ‘ఖైదీ నెం 150’ జనవరి 11న ప్రపంచవ్యాప్తంగా విడుదలై భారీ ఓపెనింగ్స్ కొల్లగొట్టడమేగాక బ్రహ్మాండమైన లాంగ్ రన్ కలెక్షన్లను రాబడుతోంది. ఈ చిత్రం మొదటి వారం వరల్డ్ వైడ్ గ్రాస్ చూస్తే రూ. 108 కోట్లు దాటిపోగా ఇప్పటి వరకు వసూలైన షేర్ రూ.100 కోట్లను తాకింది.

దీంతో చిరంజీవి రీ ఎంట్రీతో సరికొత్త రికార్డులు సృష్టించినట్లయింది. ట్రేడ్ వర్గాల లెక్కల ప్రకారం బాహుబలి చిత్రం తర్వాత రికార్డులన్నీ చాలా వరకు చిరు పేరు మీద నమోదైపోయినట్టు తెలుస్తోంది. కొన్ని ఏరియాల్లో బాహుబలిని సైతం క్రాస్ చేసినట్టు వార్తలు వినిపిస్తున్నాయి. సంక్రాంతి తర్వాత ఫిబ్రవరి 3 వరకు చెప్పుకోదగ్గ సినిమాల విడుదల లేకపోవడం, చిరంజీవి మేనియా బి, సి సెంటర్లలో బాగా పనిచేస్తుండటంతో ఖైదీకి కాసుల వర్షం కురుస్తోంది. తమిళ ‘కత్తి’ కి రీమేక్ గా రూపొందిన ఈ చిత్రాన్ని స్వయంగా నిర్మించిన చరణ్ మొదటి చిత్రమే ఇంతటి ఘన విజయం సాధించడంతో రెట్టించిన ఉత్సాహంతో తరువాతి సినిమాల్ని ప్లాన్ చేస్తున్నాడు.