​బాలయ్య గెటప్‌లో అదరగొట్టిన కిరణ్ అబ్బవరం.. ఆ పాత టీవీ వెనుక ఉన్న అసలు కథ ఏంటంటే?

Thimmarajupalli TV

యువ హీరో కిరణ్ అబ్బవరం మరోసారి నిర్మాతగా మారి కొత్త టాలెంట్‌ను ఎంకరేజ్ చేస్తూ నిర్మిస్తున్న సినిమా ‘తిమ్మరాజుపల్లి టీవీ’. స్వచ్ఛమైన పల్లెటూరి వాతావరణం, పాత రోజుల నాస్టాల్జియా నేపథ్యంగా తెరకెక్కిన ఈ పీరియాడిక్ డ్రామా ట్రైలర్‌ను విక్టరీ వెంకటేష్ చేతుల మీదుగా లాంచ్ చేశారు. హైదరాబాద్‌లో చాలా గ్రాండ్‌గా జరిగిన ఈ ట్రైలర్ రిలీజ్ వేడుక ఆద్యంతం ఆసక్తికరంగా సాగింది. ముఖ్యంగా కిరణ్ అబ్బవరం బాలకృష్ణ సూపర్ హిట్ మూవీ ‘చెన్నకేశవరెడ్డి’ గెటప్‌లో వచ్చి అందరినీ సర్ ప్రైజ్ చేశారు.

​సుమైర స్టూడియోస్‌తో కలిసి కేఏ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై వస్తున్న ఈ చిత్రానికి తేజ వేల్పుచర్ల సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ సినిమాతో సాయి తేజ్, వేద జలంధర్ హీరో హీరోయిన్లుగా టాలీవుడ్‌కు పరిచయం అవుతుండగా.. వి.మునిరాజు దర్శకుడిగా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఈ నెల 17న థియేటర్లలో సందడి చేసేందుకు సిద్ధమైంది. ఈ సందర్భంగా జరిగిన ఈవెంట్‌లో కిరణ్ అబ్బవరం మాట్లాడుతూ ట్రైలర్‌ను విడుదల చేసిన వెంకటేష్‌కి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

​పాత రోజులను గుర్తుచేస్తూ..

చిన్నప్పుడు కొత్త సినిమా వస్తే టీవీలు, వీసీడీల్లో చూసి ఎంతలా మురిసిపోయేవాళ్ళమో కిరణ్ గుర్తుచేసుకున్నారు. అప్పటి ఆ సంతోషాన్ని ఇప్పటి జనరేషన్‌కు చూపించాలనే ఉద్దేశ్యంతోనే అప్పటి హీరో, హీరోయిన్ల గెటప్స్‌లో తమ టీమ్ అంతా ఈ వేడుకలో సందడి చేశారని చెప్పారు. తనకు బాలయ్య నరసింహనాయుడు, సమరసింహారెడ్డి, చెన్నకేశవరెడ్డి లాంటి సినిమాలంటే ఎంతో ఇష్టమని, అందుకే ఈ గెటప్ వేశానని కిరణ్ చెప్పారు. ఈ కలలో భాగమైన వింటేజ్ హీరోలందరికీ ఆయన ధన్యవాదాలు తెలిపారు.

​మేం కష్టపడ్డాం.. చూడమని అడగను

ఈ సినిమా కోసం దాదాపు రెండేళ్ల పాటు టీమ్ ఎంతో కష్టపడిందని, దీన్ని తన సొంత సినిమాలాగానే ప్రమోట్ చేస్తున్నానని కిరణ్ స్పష్టం చేశారు. “మేము కష్టపడ్డాం కాబట్టి సినిమా చూడమని నేను ఎవరినీ అడగను. ఎందుకంటే ప్రేక్షకుల సమయానికి, డబ్బుకు నేను ఎంతో విలువ ఇస్తాను. మా ట్రైలర్, పాటలు, కంటెంట్ చూడండి. మీకు నచ్చితేనే థియేటర్‌కు వెళ్లి సపోర్ట్ చేయండి” అని చాలా క్లారిటీగా మాట్లాడారు.

​ఈ వేసవికి ఊరికి వెళ్లిన ఫీల్ ఈ సినిమా ఇస్తుందని, ఆర్టిస్టుల పెర్ఫార్మెన్స్, టెక్నికల్ వాల్యూస్ ప్రేక్షకులను మెప్పిస్తాయని ఆయన భరోసా ఇచ్చారు. ముఖ్యంగా యాభై ఏళ్లు దాటిన వారికి, ముప్పై-నలభై ఏళ్ల వయసులో ఉన్నవారికి పాత జ్ఞాపకాలు కచ్చితంగా గుర్తొస్తాయన్నారు. టీవీ కొనేందుకు అప్పట్లో ఎలాంటి కష్టాలు పడ్డారో ఈ సినిమా కళ్లకు కడుతుందన్నారు. పాతతరం ఎమోషన్స్ అర్థం కావాలంటే యూత్ కూడా ఈ సినిమా చూడాలని కిరణ్ అబ్బవరం సూచించారు.

Exit mobile version