మహేష్‌తో సినిమా గురించి కొరటాల ఏమన్నారంటే..!

koratala-siva
‘మిర్చి’, ‘శ్రీమంతుడు’ సినిమాలతో తెలుగులో టాప్ డైరెక్టర్స్‌లో ఒకరుగా మారిపోయిన కొరటాల శివ, తాజాగా ‘జనతా గ్యారెజ్’ అనే సినిమాతో వస్తోన్న విషయం తెలిసిందే. యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా నటించిన ఈ సినిమా రేపు ప్రపంచవ్యాప్తంగా భారీ ఎత్తున విడుదలవుతోంది. ఈ సందర్భంగా సినిమా విశేషాలను తెలుపుతూ కొరటాల శివ మీడియాతో ప్రత్యేకంగా ముచ్చటించారు. జనతా గ్యారెజ్ తన కెరీర్‌కు మరో మంచి విజయాన్ని తెచ్చిపెడుతుందన్న నమ్మకం ఉందని కొరటాల అన్నారు. అదేవిధంగా తన తదుపరి సినిమా మహేష్‌తో ఉంటుందని స్పష్టం చేశారు.

“మహేష్‌తో శ్రీమంతుడు తర్వాత మరోసారి పనిచేయబోతున్నా. ఇప్పటికే మహేష్ గారికి వినిపించిన కథ ఓకే అయిపోయింది. ప్రస్తుతం ఆ సినిమా స్క్రిప్ట్ వర్క్ చూసుకుంటున్నా. నా అన్ని సినిమాల కథా నాయకుల్లానే వచ్చే మహేష్ సినిమాలో హీరో క్యారెక్టరైజేషన్ లార్జెన్ దేన్ లైఫ్ ఉంటుంది. వచ్చే ఏడాది ఆ సినిమా ప్రారంభం అవుతుంది.” అని మహేష్‌తో సినిమా కొరటాల శివ తెలిపారు. మహేష్-కొరటాల శివ సినిమాను డీవీవీ దానయ్య నిర్మించనున్నారు.