బాలకృష్ణ పేరుకి ముందు నందమూరి అనే పదాన్ని ఎందుకు పెట్టలేదో చెప్పిన దర్శకుడు క్రిష్ !

19th, October 2016 - 12:09:17 PM

krish
నందమూరి బాలకృష్ణ నటిస్తున్న 100వ చిత్రం ‘గౌతమీపుత్ర శాతకర్ణి’. దర్శకుడు క్రిష్ ఏంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న ఈ చిత్రం తాలూకు ఫస్ట్ లుక్, టీజర్ ఈ మధ్యే విడుదలయ్యాయి. వీటిని బాగా గమనిస్తే ఒక విషయం అర్థమవుతుంది. అదేమంటే వాటిలో బాలకృష్ణ పేరుకుకి ముందు ఆయన ఇంటి పేరు ‘నందమూరి’ అనే పదం అక్కడ కనిపించదు. ఇప్పటి వరకూ అభిమానులు నందమూరి అనే ఇంటి పేరు లేకుండా బాలయ్య పేరును వెండి తెరమీద చూడలేదు. బాలకృష్ణకు కూడా తన ఇంటి పేరంటే ఎంతలేని గౌరవం, మక్కువ. అలాంటిది ఈ సినిమాలో మాత్రం ఆ ఇంటి పేరును వాడలేదు. అందుకు ఓ బలమైన, చక్కనైన కారణం చెప్పాడు క్రిష్.

అదేమంటే పూర్వకాలం నుండి వ్యక్తుల పేర్లకు ముందు వాళ్ళ తండ్రి యొక్క పేరు మాత్రమే ఉండేదని, అది కహీనమైన నియమం అని, అలాంటి పితృస్వామ్యపు రోజుల్లో మొట్ట మొదట తల్లి పేరైన ‘గౌతమి’ని తన ఇంటి పేరుగా మార్చుకున్న రాజు శాతకర్ణి అని అందుకే ఆయన పేరు గౌతమీపుత్ర శాతకర్ణి అయిందని, ఆ నియమాన్ని పాటిస్తూ బాలయ్య పేరును ‘బసవరామతారకపుత్ర బాలకృష్ణ’ అని వేశామని అన్నారు. ఇక్కడ కేవలం బాలయ్య పేరు మాత్రమేగాక క్రిష్ పేరు కూడా ‘అంజనపుత్ర క్రిష్’ అని నిర్మాతల పేర్లు రాజ్య లక్ష్మిపుత్ర బిబో శ్రీనివాస్, సీతరామాపుత్ర సాయి బాబు, కమలపుత్ర రాజీవ్ రెడ్డి’ అని ఉంటుంది. ఇలా అందరి పేర్లకు ముందు వాళ్ళ తల్లి పేర్లను ఉంచామని, ఒక కొడుకు తండ్రికన్నా గొప్పవాడు కాగలడు కానీ, తల్లి కన్నా గొప్పవాడు కాలేడని, ఇది తల్లికి ఇచ్చే గౌరవం అని క్రిష్ అన్నారు.