వేసవి బరిలో దిగేందుకు సిద్దమవుతున్న కృష్ణ వంశీ !

25th, April 2017 - 12:51:17 PM


వరుస పరాజయాల తర్వాత దర్శకుడు కృష్ణ వంశీ చేస్తున్న చిత్రం ‘నక్షత్రం’. ఈసారి ఎలాగైనా భారీ విరాజయం అందుకోవాలని లక్ష్యంతో ఈ సినిమా కోసం అన్ని విధాల కష్టపడుతున్నాడు కృష్ణవంశీ. సినిమాలోని ప్రతి అంశంలో కొత్తదనం, ప్రేక్షకులకు థ్రిల్ ఉండేలా చూస్తున్నాడు. ప్రస్తుతం ఒక్క పాట మినహా చిత్ర షూటింగ్ మొత్తం పూర్తయినట్టు తెలుస్తోంది. మరోవైపు పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కూడా వేగంగానే జరుగుతుండటంతో చిత్రాన్ని మే నెలలో రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

‘బాహుబలి – 2’ చిత్రం ఏప్రిల్ 28న రిలీజ్ కానుండటంతో ఇతర చిత్రాలు ‘బాబు బాగా బిజీ, అందగాడు, కేశవ’ వంటివన్నీ నక్షత్రంతో పాటే మే నెలలోనే విడుదల కానున్నాయి. దీంతో వేసవి పోటీ హోరా హోరీగా జరగనుంది. ఇకపోతే ఈ చిత్రంలో సందీప్ కిషన్, రెజినాలు ప్రధాన పాత్రలు పోషిస్తుండగా ప్రగ్యా జైస్వాల్, సాయి ధరమ్ తేజ్ అతిధి పాత్రల్లోను, ప్రకాష్ రాజ్, తనీష్ ఇతర పాత్రల్లోనూ కనిపించనున్నారు.