యంగ్ బ్యూటీ కృతి శెట్టి తన కెరీర్, ఎదుర్కొంటున్న విమర్శలు మరియు వ్యక్తిగత విషయాలపై మనసు విప్పి మాట్లాడింది. నటిగా తాను ప్రతి పాత్ర కోసం 100 శాతం కష్టపడతానని, అయితే సినిమా ఫలితం తన చేతుల్లో ఉండదని ఆమె స్పష్టం చేసింది. కేవలం ఫ్లాపుల కారణంగా తనను ‘ఐరెన్ లెగ్’ అని పిలవడం పట్ల ఆమె తీవ్ర ఆవేదన వ్యక్తం చేసింది. సినిమా సక్సెస్ అనేది అనేక అంశాలపై ఆధారపడి ఉంటుందని, కేవలం తనను బాధ్యురాలిని చేస్తూ నెగటివ్ ట్రోల్స్ చేయడం బాధాకరమని కృతి పేర్కొంది.
ప్రస్తుతం తను నటిస్తున్న ‘లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ’ చిత్రంపై కృతి చాలా ఆశలు పెట్టుకుంది. ఈ సినిమాలో ఆమె ‘ధీమా’ అనే విభిన్నమైన పాత్రలో కనిపించనుంది. 2040 నాటి నేపథ్యంలో సాగే ఈ కథలో సోషల్ మీడియాకు బానిసైన, ఫోన్ లేకపోతే ఉండలేని ‘నోమోఫోబియా’ కలిగిన యువతిగా ఆమె నటించింది. ఈ చిత్రం షూటింగ్ సమయంలో లేడీ సూపర్ స్టార్ నయనతార తనను ఎంతో సపోర్ట్ చేసిందని, ఒక సమస్యలో ఉన్నప్పుడు నయనతార స్వయంగా ఫోన్ చేసి గైడ్ చేయడం తనకు ఎంతో ధైర్యాన్ని ఇచ్చిందని కృతి గుర్తుచేసుకుంది.
ఇక తన వ్యక్తిగత జీవితం మరియు భవిష్యత్తు ప్రణాళికల గురించి చెబుతూ.. తాను పాతకాలపు పద్ధతిలో సాగే ప్రేమనే ఇష్టపడతానని కృతి వెల్లడించింది. ప్రస్తుతానికి తన పూర్తి ఫోకస్ సినిమాలపైనే ఉందని, మరో 5 నుంచి 10 ఏళ్ల తర్వాతే డేటింగ్ లేదా పెళ్లి గురించి ఆలోచిస్తానని స్పష్టం చేసింది.
