
కృతి సనన్.. ‘1 నేనొక్కడినే’, ‘దోచేయ్’ సినిమాలతో తెలుగులో మంచి గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్. ఈ సినిమాల ద్వారా అందం, నటనలో మంచి మార్కులు కొట్టేసిన కృతి, ఆ తర్వాత బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ సినిమాలో నటించే అవకాశం సొంతం చేసుకొని అందరి దృష్టినీ ఆకర్షించారు. ‘దిల్వాలే’ పేరుతో బాలీవుడ్లో ఈ ఏడాదికి క్రేజీ ప్రాజెక్టుల్లో ఒకటిగా తెరకెక్కుతోన్న ఈ సినిమా ప్రస్తుతం హైద్రాబాద్లో షూటింగ్ జరుపుకుంటోంది.
రోహిత్ శెట్టి దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ సినిమాలో హీరో వరుణ్ ధావన్, కృతి సనన్ నేపథ్యంలో వచ్చే కొన్ని సన్నివేశాలను ప్రస్తుతం రామోజీ ఫిల్మ్ సిటీలో చిత్రీకరిస్తున్నారు. భారీ బడ్జెట్తో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో కాజోల్ మరో హీరోయిన్గా నటిస్తున్నారు. డిసెంబర్ నెలలో ఈ సినిమాను విడుదల చేసేందుకు షారూఖ్ ప్లాన్ చేస్తున్నారు. ఇక ఈ సినిమాయే కాక ఫర్జీ అనే మరో సినిమాలోనూ కృతి సనన్ హీరోయిన్గా ఎంపికయ్యారు.