ఇంటర్వ్యూ : లగడపాటి శ్రీధర్ – అమీర్ ఖాన్ తర్వాత అలా చేసేది అల్లు అర్జునే !

అల్లు అర్జున్, వక్కంతం వంశీల కలయికలో వస్తున్న తాజా చిత్రం ‘నా పేరు సూర్య’. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ చిత్రం యొక్క ఫస్ట్ ఇంపాక్ట్ ఇటీవలే విడుదలై మంచి స్పందన తెచ్చుకుంది. ఈ సందర్బంగా చిత్ర నిర్మాత లగడపాటి శ్రీధర్ మీడియాతో మాట్లాడారు. ఆ విశేషాలు మీకోసం..

ప్ర) ‘నా పేరు సూర్య’ ఫస్ట్ ఇంపాక్ట్ కి స్పందన ఎలా వస్తోంది ?
జ) ఇప్పటి వరకు బన్నీ అంటే ప్రేక్షకులకి ఎంత ప్రేమో విన్నాను. కానీ మా ఫస్ట్ ఇంపాక్ట్ కు వచ్చిన స్పందనతో అది ఎలా ఉంటుందో చూశాను. 29 గంటల్లో కోటి మందికి పైగా ఇంపాక్ట్ ను వీక్షించారు. అందుకు ప్రేక్షకులందరికీ కృతజ్ఞతలు.

ప్ర) మీ హీరో అల్లు అర్జున్ గురించి చెప్పండి :
జ) అల్లు అర్జున్ ఒక పాన్ ఇండియా స్టార్. ఈ సినిమా కోసం ఎంతో కష్టపడ్డారాయన. మేకోవర్, లుక్స్, టెక్నీషియన్స్ అన్ని విషయాల్ని వ్యక్తిగతంగా దగ్గరుండి చూసుకుంటారు. తెలుగు సినిమా ఖ్యాతిని పెంచడానికి బన్నీ చాలా ట్రై చేస్తుంటాడు. సినిమా సినిమాకి తన హార్డ్ వర్క్ పెంచుతూ పైకెదిగే హీరో అమీర్ ఖాన్. ఆయన తర్వాత అలా చేసేది బన్నీయే అనేది నా నమ్మకం.

ప్ర) మీ దర్శకుడు వక్కంతం వంశీ వర్క్ ఎలా ఉంది ?
జ) మూడు బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్లు ‘రేసు గుర్రం, టెంపర్, కిక్’ వంటి చిత్రాల్లోని పవర్ మొత్తం ఈ ఒక్క సినిమాలో ఉంటుంది. వక్కంతం వంశీగారు తన టీమ్ తో సినిమాను బాగా లీడ్ చేస్తున్నారు.

ప్ర) సినిమా ఎలా ఉండబోతోంది ?
జ) సినిమా తప్పకుండా ప్రేక్షకుల్ని అలరిస్తుంది. బాహుబలి తెలుగు సినిమా కీర్తిని ఎంతవరకు తీసుకెళ్ళిందో ఇది కూడా అలానే తీసుకెళుతుంది. ఈ సంవత్సరం బిగ్గెస్ట్ హిట్ గా నిలబడుతుంది.

ప్ర) రిలీజ్ డేట్ మారొచ్చనే టాక్ ఉంది ?
జ) లేదు. సమ్మర్ కి ఖచ్చితంగా వస్తున్నాం. ఏప్రిల్ 27న తప్పకుండా రిలీజవుతుంది. మార్చి కల్లా సినిమా ప్రొడక్షన్ పూర్తవుతుంది.

ప్ర) ఇందులో ఏయే ఎలిమెంట్స్ ఉంటాయి ?
జ) ఇందులో కేవలం దేశభక్తి మాత్రమే కాక రొమాన్స్, ఫ్యామిలీ ఎలిమెంట్స్, సొసైటీ అనే అంశాలు కూడా ఉంటాయి.

ప్ర) దేశవ్యాప్తంగా రిలీజ్ చేస్తున్నట్టున్నారు ?
జ) ఇదొక యూనివర్సల్ సబ్జెక్ట్. ముందుగా మిగతా భాషల్లో కూడా డబ్ చేసి రిలీజ్ చేద్దామనే ఆలోచన ఉంది. కానీ బన్నీ త్వరలో తమిళంలో పరిచయంకానున్నారు. ఆ ఎంట్రీ డైరెక్ట్ తమిల్ సినిమాటినే ఉంటే బాగుంటుందని చేయలేదు.

ప్ర) ప్రస్తుతం సినిమా పనులు ఎంతవరకు వచ్చాయ్ ?
జ) 70 శాతం షూటింగ్ పూర్తైంది. ఇంకో 40 రోజుల్లో మొత్తం పూర్తవవుతుంది. మార్చి కల్లా సినిమా ఫస్ట్ కాపీ చేతికొస్తుంది.

ప్ర) సినిమాలో యాక్షన్ స్థాయి ఎక్కువగా ఉండేట్టుంది ?
జ) అవును. కానీ ఆ యాక్షన్ లో కూడా ఎమోషన్ ఉంటుంది. కిచ్చ మాస్టర్, పీటర్ హెయిన్స్, రామ్ లక్ష్మణ్, రవివర్మ వంటి పెద్ద పెద్ద వాళ్ళు ఫైట్స్ కంపోజ్ చేశారు. ఫైట్స్ అన్నీ గొప్ప స్థాయిలో ఉంటాయి. ప్రతిదీ బెంచ్ మార్క్ ఫైట్ లా ఉంటుంది.