సోషల్ మీడియా సెన్సేషన్ హీరోయిన్ ప్రియా ప్రకాష్ వారియర్ కి మంచి క్రేజ్ ఉన్న సంగతి తెలిసిందే. ఆ క్రేజ్ ను దృష్టిలో పెట్టుకుని మన దర్శకులు ఆ మధ్య కొన్ని ఆఫర్లు ఇచ్చినా.. అమ్ముడికి ఆశ ఎక్కువై భారీ సినిమాల కోసం భారీ రెమ్యునరేషన్ కోసం ఎదురుచూసింది. దాంతో వచ్చిన ఆఫర్లు కాస్త దూరమైపోయాయి. ఇక ఆ తరువాత ఆమె హీరోయిన్ గా నటించిన ‘ఓరు అదార్ లవ్’ చిత్రం ‘లవర్స్ డే’ పేరుతో తెలుగులోకి డబ్ అయి ఫ్లాప్ కావడంతో ఆమె ఆశలకు బ్రేకులు పడ్డాయి. దాంతో ఈ యంగ్ బ్యూటీకి తత్త్వం బోధపడి.. వచ్చిన అవకాశాలను కాదనుకుండా ఒప్పేసుకుంటుంది. పైగా తానే స్వయంగా దర్శకులకు ఫోన్ చేసి మరి తనకు ఛాన్స్ ఇవ్వాల్సిందిగా కోరుతుందట. మొత్తానికి ఇప్పుడు ప్రియా చూపు తెలుగు సినిమాల వైపే ఉంది.
కాగా ప్రియా, విజయ్ దేవరకొండ సినిమాలో ఒక కీలక పాత్రలో నటించబోతున్నట్లు తెలుస్తోంది. దక్షిణాదిన ఇతర భాషల్లో ఒకటి రెండు సినిమాలు చేసి మంచి ఫేమ్ తెచ్చుకున్న హీరోయిన్లు నెక్స్ట్ టార్గెట్ చేసేది తెలుగు సినిమా పరిశ్రమే. అలా వచ్చిన వారే సాయి పల్లవి, అనుపమ పరమేశ్వరన్, రష్మిక మందన్న. ప్రస్తుతం వీరి కెరీర్ టాప్ గేర్లో ఉంది. వీళ్ళ మాదిరిగానే ప్రియా ప్రకాష్ వారియర్ సైతం పయనించబోతుంది. ఈ క్రమంలోనే నితిన్ కొత్త సినిమాలో ఆమె రెండో కథానాయకిగా ఛాన్స్ కొట్టేసింది. ఇప్పుడు మరో తెలుగు సినిమాలో కూడా నటించబోతుందట. ఆ వివరాలు త్వరలో తెలియనున్నాయి.
