హవా కొనసాగిస్తున్న ‘ఖైదీ నెం 150’ !

27th, January 2017 - 09:28:37 AM


ఈ వారం కూడా పెద్ద సినిమాల రిలీజ్ లేకపోవడంతో థియేటర్లలో ‘ఖైదీ నెం 150’ హవా స్పష్టంగా కనిపిస్తోంది. మొదటి రోజు నుండే హిట్ టాక్ తెచ్చుకోవడం, 9 సంవత్సరాల తర్వాత చిరంజీవి రీ ఎంట్రీ ఇస్తూ చేసిన చిత్రం కావడంతో అభిమానులే కాకుండా ఫ్యామిలీ ఆడియన్స్ సహా తెలుగు సినీ ప్రేక్షకులంతా సినిమా చూసేందుకు ఆసక్తి చూపుతున్నారు. దీంతో మొదటి వారంలోనే ప్రపంచవ్యాప్తంగా రూ. 108 కోట్ల గ్రాస్ ను వసూలు చేసింది ఈ చిత్రం. అలాగే పలు ఏరియాల్లో సరికొత్త రికార్డుల్ని సైతం సృష్టిస్తూ డిస్ట్రిబ్యూటర్లను లాభాల దిశగా నడిపిస్తోంది.

ట్రేడ్ వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం ఈ చిత్రం ఇప్పటి దాకా ప్రపంచవ్యాప్తంగా రూ. 96 కోట్ల రూపాయల షేర్ ను వసూలు చేసి రూ. 100 కోట్ల షేర్ కు దగ్గరవుతున్నట్టు తెలుస్తోంది. ఇకపోతే నిన్న ఒక్కరోజే ఈ చిత్రం రూ. 2 కోట్ల గ్రాస్ ను రాబట్టిందట. పైగా ఫిబ్రవరి 3 వరకు సినిమాల విడుదల లేకపోవడం కూడా ఈ చిత్ర కలెక్షన్లకు మరింత కలిసొచ్చే అంశంగా మారనుంది. చిత్రానికి ఇంతటి ఘన విజయాన్ని అందించినందుకుగాను రేపు 28న హైదరాబాద్లో భారీ సక్సె మీట్ ను ఏర్పాటు చేయనున్నారు చిత్ర టీమ్.