‘కేరళ స్టోరీ 2’ కి లైన్ క్లియర్.. ఇక రిలీజ్ ఖాయం..?

The-Kerala-Story-2

​’కేరళ స్టోరీ 2′ విడుదల వ్యవహారం వెండితెరపై వచ్చే సస్పెన్స్ థ్రిల్లర్‌ను తలపిస్తోంది. ఈ సినిమా నిన్న(ఫిబ్రవరి 27) విడుదల కావాల్సి ఉండగా, కేరళ హైకోర్టు సింగిల్ బెంచ్ జడ్జి జస్టిస్ బేచు కురియన్ థామస్ చిత్ర ప్రదర్శనపై రెండు వారాల పాటు స్టే విధిస్తూ సంచలన తీర్పునిచ్చారు. పిటిషనర్లు వ్యక్తం చేసిన అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకున్న కోర్టు, చిత్ర బృందానికి పెద్ద షాక్ ఇచ్చింది. దీంతో అప్పటికే అడ్వాన్స్ బుకింగ్స్ చేసుకున్న ప్రేక్షకులకు టికెట్ బుకింగ్ యాప్స్ సొమ్మును రీఫండ్ చేశాయి.

​అయితే, ఈ తీర్పుపై దర్శక నిర్మాతలు వెంటనే డివిజన్ బెంచ్‌ను ఆశ్రయించగా వారికి ఊరట లభించింది. జడ్జీలు ధర్మాధికారి, బాలకృష్ణన్‌లతో కూడిన ధర్మాసనం పదిహేను రోజుల స్టేను ఎత్తివేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో థియేటర్లలో సినిమా విడుదలకు రూట్ క్లియర్ అయ్యింది. సెన్సార్ బోర్డు ఇప్పటికే సర్టిఫికెట్ ఇచ్చేయడం నిర్మాతలకు చట్టపరంగా పెద్ద అడ్వాంటేజ్‌గా మారింది. ఇప్పుడు ఎవరైనా సుప్రీంకోర్టుకు వెళ్లి స్టే తెస్తే తప్ప ఈ సినిమా ప్రదర్శన ఆగదు.

​మరోవైపు ఈ సినిమా చుట్టూ రాజకీయ విమర్శలు కూడా మొదలయ్యాయి. ఇదొక ‘ప్రాపగండా’ సినిమా అని కొందరు నెటిజన్లు విమర్శిస్తుంటే, తాము కేవలం వాస్తవాలనే చూపించామని, సినిమా చూశాకే అభిప్రాయం చెప్పాలని నిర్మాత విపుల్ అమృత్ షా గట్టిగా వాదిస్తున్నారు. కోర్టు ఆదేశాలతో ఊపిరి పీల్చుకున్న చిత్ర యూనిట్, మళ్ళీ బుకింగ్స్ ప్రారంభించే పనిలో పడింది. మరి ఈ వివాదం సుప్రీంకోర్టు వరకు వెళ్తుందా లేక ప్రశాంతంగా ప్రదర్శితమవుతుందా అన్నది ఆసక్తికరంగా మారింది.

Exit mobile version