ఎన్టీఆర్ సినిమాను పక్కనబెట్టి బన్నీ సినిమా చేస్తున్న టాప్ డైరెక్టర్

lingusamy-allu-arjun
తమిళ దర్శకుడు లింగుస్వామి ఎట్టకేలకు అనుకున్నది సాధించాడు. త్వరలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తో సినిమా మొదలుపెట్టబోతున్నాడు. కొంతకాలంగా తమిళంలో సరైన హిట్ సాదించలేకపోయిన ఈ దర్శకుడు తెలుగులో అదృష్టాన్ని పరీక్షించుకుందామనుకుని స్టార్ హీరోలతో ప్రయత్నాలు మొదలుపెట్టాడు. ముందుగా రెండేళ్ల క్రితం మహేష్ బాబుకు కథ చెప్పగా మహేష్ దాన్ని రిజెక్ట్ చేశాడు. ఆ తరువాత బన్నీకి కథ వినిపించగా నచ్చిందన్నాడు కానీ ఎందుకో కమిట్మెంట్ ఇవ్వలేదు.

దీంతో లింగుస్వామి ఎన్టీఆర్ వద్దకు వెళ్లి స్టోరీ లైన్ చెప్పగా అది నచ్చిన ఎన్టీఆర్ నిర్మాతతో మాట్లాడండి అని చెప్పాడట. దీంతో నిర్మాతలను కలిసి ఒప్పించే పనిలో పడ్డాడు ఈ తమిళ దర్శకుడు. కానీ అనుకోకుండా ఆయనకు బన్నీ ఫోన్ చేసి మనం సినిమా చేస్తున్నాం, ఎలాంటి కమిట్మెంట్స్ పెట్టుకోవద్దు అని చెప్పాడట. దీంతో లింగుస్వామి ఎన్టీఆర్ ప్రాజెక్టును పక్కనబెట్టి బన్నీతో సినిమా చేసేందుకు రెడీ అవుతున్నాడు. ఈ చిత్రాన్ని స్టూడియో గ్రీన్ సంస్థ నిర్మించనుంది. దీనికి సంబందించిన అధికారిక ప్రకటన ఈరోజు చెన్నైలో జరుగుతుంది. సినీ వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం వీరి సినిమా జనవరి నుండి సెట్స్ పైకి వెళ్లే అవకాశముందని తెలుస్తోంది.