ఇంటర్వ్యూ : కృష్ణ కాంత్ – ఈ సినిమాలోని సర్ ప్రైజ్ ఎలిమెంట్ ఇంతవరకి ఇండియన్ స్క్రీన్ మీద రాలేదు !

హను రాఘవపూడి దర్శకత్వంలో శర్వానంద్ హీరోగా సాయి పల్లవి హీరోయిన్ గా రాబోతున్న చిత్రం ‘పడి పడి లేచె మనసు’. సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్న ఈ చిత్రం డిసెంబర్ 21 న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. కాగా పాటల రచయిత కృష్ణ కాంత్ ఈ చిత్రానికి పాటల సాహిత్యం అందించగా.. విశాల్ చంద్రశేఖర్ సంగీతాన్ని సమకూర్చారు. ఇప్పటికే ఈ చిత్రం యొక్క ఆల్బమ్ మంచి హిట్ అయింది. ఈ సందర్భంగా పాటల రచయిత కృష్ణ కాంత్ మీడియాతో మాట్లాడారు. ఆ విశేషాలు ఇప్పుడు మీకోసం

ఒక సినిమాలో ఒకటి, రెండు పాటలు రాయడం ఈజీనా ? లేక సినిమాలోని మొత్తం పాటలు రాయటం ఈజీనా ?

ప్రతి పాటకి ఒకే కష్టం ఉంటుంది అండి. కాకపోతే ఒకటి రెండు పాటలు రాసేటప్పుడు మనకు ఆ పాట రావడానికి గల సన్నివేశం మాత్రమే చెబుతారు, దాంతో కథ గురించి పూర్తిగా తెలుసుకునే అవకాశం చాలా తక్కువగా ఉంటుంది. అదే ఒక సినిమాలోని మొత్తం పాటలు ఒకే రైటర్ రాస్తే.. అతనికి డైరెక్టర్ మొత్తం కథ పూర్తిగా చెబుతారు. అప్పుడు కథను దృష్టిలో పెట్టుకుని పాటలోని ప్రతి పదం రాసే అవకాశం ఉంటుంది.

ఈ సినిమాలో మీరు రాసిన ప్రతి పాటకు సిచ్యుయేషన్ ఉంటుందా ? లేక పాట రావాలి కాబట్టి, పాట వచ్చింది అన్నట్లు ఉంటుందా ?

హను సినిమాల్లో ప్రతి పాటకు మంచి సిచ్యుయేషన్ ఉంటుంది అండి.. మీరు చూసుకుంటే అందాలరాక్షసి దగ్గర నుంచి లై వరకు అన్ని సినిమాల్లోని పాటలు సందర్భానుసారం మాత్రమే వస్తాయి తప్ప.. ఎదో రావాలి కాబట్టి అని అలా ఒక్క పాట కూడా రాదు. ఈ సినిమాలో కూడా అంతే ప్రతి పాట సందర్భానుసారంగానే వస్తోంది.

ఇప్పటివరకు వచ్చిన ప్రోమోస్ చూస్తుంటే మంచి లవ్ స్టోరీ లా అనిపిస్తోంది. ఈ సినిమా గురించి చెప్పండి ?

అవునండి. సినిమాలో మంచి ప్రేమ కథ ఉండి. అలాగే సెకెండాఫ్ లో కొన్ని సన్నివేశాలు చాలా బాగుంటాయి. ముఖ్యంగా సినిమాలో ఓ సర్ ప్రైజ్ ఎలిమెంట్ ఉంది. అది ఇంతవరకి ఇండియన్ స్క్రీన్ మీద రాలేదు. అది గాని ప్రేక్షకులకు కనెక్ట్ అయితే మాత్రం ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అవుతుంది.

ఏమిటి ఆ సర్ ప్రైజ్ ఎలిమెంట్… తెలుసుకోవచ్చా ?

రేపు సినిమా చూశాక మీకే అర్ధమవుతుంది. అన్ని ప్రేమ కథల్లానే ఈ ప్రేమకథ కూడా మొదలైన.. కథలోని కొన్ని అంశాలు చాలా గమ్మత్తుగా ఉంటాయి. ఒక్క మాటలో చెప్పాలంటే ప్రేమ కథల్లోనే ఈ ప్రేమ కథ చాలా వైవిధ్యంగా ఉంటుంది.

ఈ సినిమాకి అన్ని పాటలు మీరే రాశారు. ఎలా రాశారు ?

నేను పాటలు రాసేటప్పుడు డైరెక్టర్ హను రాఘవపూడి నా పక్కనే ఉంటారు. ప్రతి పాట మేం ఇద్దరం డిస్కస్ చేశాకే.. నేను పాట రాస్తాను. ఆ రకంగా ఆలోచిస్తే ప్రతి పాటలో హను ఇన్ పుట్స్ చాలా ఉన్నాయి.

మీకు బాగా ఇష్టమైన పాటల రచయిత ఎవరు ?

వేటూరిగారు అంటే నాకు బాగా ఇష్టం అండి. అలాగే శాస్త్రిగారు కూడా నాకు బాగా ఇష్టం. మీరు చూస్తే వేటూరిగారు చేసినన్ని పద ప్రయోగాలు ఏ సినీ రచయిత చేయలేదనిపిస్తోంది. ఆయన పాటలు భవిష్యత్తు తరాలకి కూడా గుర్తిండిపోతాయి.

మీరు కూడా కొత్త కొత్త ప్రయోగాలు చేస్తారుగా.. వాటి కోసం ఏమైనా ప్రత్యేకమైన కసరత్తలు చేస్తారా ?

అందరు రచయితలూ చేసేది నేను చేస్తాను అండి. నేనంటూ ప్రత్యేకమైన కసరత్తలు ఏమి చెయ్యను. కాకపోతే నేను ఏ సినిమాకి పాటలు రాస్తే.. ఆ సినిమా డైరెక్టర్ తో ట్రావెల్ అవుతున్నాను. అలా ఆ డైరెక్టర్ ల అభిరుచి తగ్గట్లు నా సాహిత్యాన్ని ఉంచడానికి ప్రయత్నిస్తాను.

మీకు ఎక్కువుగా ఏ మ్యూజిక్ డైరెక్టర్ తో పని చెయ్యడం ఇష్టం ?

అందరూ మ్యూజిక్ డైరెక్టర్స్ తో పని చెయ్యడం ఇష్టమే అండి. తెలుగులో కీరవాణి గారితో తప్ప నెను అందరి మ్యూజిక్ డైరెక్టర్స్ తో వర్క్ చేశాను. ఒకొక్కరిలో ఒక్కోటి నేర్చుకుంటాం. అలా అందరూ నాకు ఇష్టమే.

ఈ సినిమా ఆడియో సూపర్ హిట్ అయింది. మీకు ఏ సాంగ్ అంటే బాగా నచ్చింది ?

రాసింది నేనే కాబట్టి నాకు అన్ని సాంగ్స్ నచ్చాయి. ‘పడి పడి లేచె మనసు’ పాట అటు ప్రేమికులతో పాటు ఇటు మ్యూజిక్ లవర్స్ ని కూడా ఆకట్టుకుంటుంది. అలాగే మిగిలిన అన్ని పాటలు కూడా బాగా ఆకట్టుకుంటున్నాయి. అందుకే అన్ని ఇష్టమే.

Exit mobile version