
‘మా’ ఎన్నికల ఫలితాలు ఈ వారంలో లేనట్టేనా ? అంటే మిగిలేది అవుననే సమాధానమే! గత కొద్ది రోజులుగా కేవలం సినీ పరిశ్రమలోనే కాక, సామాన్య ప్రజానీకంలోనూ ‘మా’ (మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్) ఎన్నికలు మంచి ఆసక్తిని రేకెత్తించాయి. తెలుగు సినీ పరిశ్రమలో నటీనటుల సమస్యల పరిష్కారం కోసం ఏర్పాటైన ఈ అసోసియేషన్‌కు ఎన్నికలు ఎక్కువ సార్లు ఏకగ్రీవంగానే జరిగాయి. గత రెండు దఫాలుగా మా అధ్యక్ష పదవిలో ప్రస్తుత ఎంపీ మురళీ మోహన్ కొనసాగుతున్నారు. రాజకీయ కార్యక్రమాల్లో బిజీగా ఉండడంతో ఆయన మళ్ళీ ఈ పదవిని చేపట్టే ఆలోచన చేయలేదు. ఆ క్రమంలోనే 2015-17 దఫాకు రాజేంద్రపసాద్ పోటీలో నిలబడ్డారు. మొదట ఏకగ్రీవంగా రాజేంద్రుడే గెలుస్తారని భావించినా చివర్లో ప్రముఖ నటి జయసుధ కూడా రంగంలోకి దిగడంతో పోటీ తప్పనిసరైంది.
ఇరువర్గాలు ఒకరిపై ఒకరు తీవ్ర విమర్శలు చేసుకోవడం, సవాళ్ళు విసురుకోవడంతో ఈ ఎన్నికల తంతు సామాన్యుడికీ హాట్ టాపిక్‌గా మారింది. ఇక మార్చి 29న ఈ ఎన్నికలకు పోలింగ్ జరిగింది. ఉదయం 8గంటల నుండి మధ్యాహ్నం 2గంటల వరకు సాగిన పోలింగ్‌లో 702ఓట్లకు గానూ మొత్తం 394ఓట్లు పోలయ్యాయి. ఎన్నికలు ఇప్పటికే ముగిసినా ఫలితాలు మాత్రం ఇప్పుడే విడుదలయ్యే సూచనలు లేవు. అప్పట్లో ‘మా’ ఎన్నికలను నిలిపివేయాలని కోర్టులో వేసిన ఓ పిటిషన్‌ను స్వీకరించిన కోర్టు, ఎన్నికల నిర్వహణను నిలిపివేయడాన్ని తోసిపుచ్చింది. అయితే.. తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకూ ఫలితాలు ప్రకటించకూడదని తెలిపింది. ఇక ఈ ఉదయం అందుకు సంబంధించిన విచారణను చేపట్టిన హైకోర్టు పూర్తి విచారణను ఏప్రిల్ 7కు వాయిదా వేసింది. ఏప్రిల్ 7న వచ్చే తీర్పు ప్రకారం ‘మా’ ఎన్నికల ఫలితాలపై ఓ స్పష్టత వచ్చే అవకాశముంది.