మరోసారి వాయిదాపడిన మహేష్ 23 ఫస్ట్ లుక్ !


స్టార్ హీరో మహేష్ బాబు – మురుగదాస్ డైరెక్షన్లో చేస్తున్న భారీ బడ్జెట్ చిత్రం యొక్క ఫస్ట్ లుక్ పలు వాయిదాల తర్వాత ఈరోజు ఉగాదికి రిలీజవుతుందని అనుకోగా ఈ రోజు కూడా వాయిదా పడింది. దీంతో గత రెండు మూడు రోజులుగా ఫస్ట్ లుక్ కోసం ఆత్రుతగా ఎదురుచూస్తున్న అభిమానులకు ఈసారి కూడా నిరాశే ఎదురైంది. ప్రస్తుతం వియత్నాంలో కీలక పోరాట సన్నివేశాల చిత్రీకరణలో ఉన్న టీమ్ ఏప్రిల్ 2వ తేదీన చెన్నై చేరుకుంటారట.

అప్పుడే ఫస్ట్ లుక్ యొక్క ఖచ్చితమైన రిలీజ్ తేదీని నిర్ణయించి అధికారికంగా ప్రకటిస్తారట. ఈసారి ప్రకటించబోయే తేదీలో ఎలాంటి వాయిదాలు ఉండవని, చెప్పిన ప్రకారమే పర్ఫెక్ట్ గా ఫస్ట్ లుక్ ను విడుదలచేస్తారని తెలుస్తోంది. తెలుగు, తమిళ భాషల్లో రిలీజ్ కానున్న ఈ సినిమాను హిందీలో సైతం విడుదల చేయనున్నారు. ఎన్వీ ప్రసాద్, ఠాగూర్ మధులు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో రకుల్ ప్రీత్ హీరోయిన్ గా నటిస్తుండగా హరీశ్ జైరాజ్ సంగీతం అందిస్తున్నారు.