సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu) ప్రస్తుతం దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి దర్శకత్వంలో భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ‘వారణాసి’ చిత్ర షూటింగ్లో బిజీగా ఉన్నారు. ఇంత బిజీ షెడ్యూల్లో కూడా ఆయన ప్రముఖ దర్శకుడు గుణశేఖర్ రూపొందించిన తాజా చిత్రం ‘యుఫోరియా’ను వీక్షించారు. ఒక స్టార్ హీరో ఇలా చిన్న సినిమాలను ప్రోత్సహించడం పట్ల ఇండస్ట్రీలో హర్షం వ్యక్తమవుతోంది.
సినిమా చూసిన అనంతరం మహేష్ బాబు సోషల్ మీడియా వేదికగా తన స్పందనను పంచుకున్నారు. “గుణశేఖర్ గారు తన కథలను ప్రెజెంట్ చేసే విధానంలో ఎప్పుడూ ఒక ప్రత్యేకమైన శైలి ఉంటుంది. ఈ సినిమా నాకు బాగా నచ్చింది, ముఖ్యంగా క్లైమాక్స్ తీర్చిదిద్దిన తీరు అద్భుతం. ప్రతి ఒక్కరూ చూడాల్సిన సినిమా ఇది. గుణశేఖర్ గారికి, భూమిక చావ్లాకు మరియు యుఫోరియా టీమ్ మొత్తానికి అభినందనలు” అంటూ రాసుకొచ్చారు. మహేష్ ఇచ్చిన రెస్పాన్స్ తో చిత్ర యూనిట్‌కు కొండంత బలాన్ని వచ్చింది.
ఈ చిత్రం ద్వారా సారా అర్జున్ తెలుగులో హీరోయిన్గా పరిచయం కాగా, విఘ్నేష్ గవిరెడ్డి నటుడిగా తన తొలి అడుగు వేశారు. వీరిద్దరి నటనకు మంచి ప్రశంసలు దక్కుతున్నాయి. నీలిమ గుణ మరియు యుక్త గుణ నిర్మించిన ఈ చిత్రానికి కాల భైరవ సంగీతాన్ని అందించాడు.
