జనవరిలో సెట్స్‌పైకి మహేష్-కొరటాల సినిమా!

Mahesh-Babu-Koratala-Shiva
‘మిర్చి’, ‘శ్రీమంతుడు’ సినిమాలతో తెలుగులో టాప్ డైరెక్టర్స్‌లో ఒకరుగా మారిపోయిన కొరటాల శివ, తాజాగా ‘జనతా గ్యారేజ్’ అనే సినిమాతో వరుసగా మూడో బ్లాక్‌బస్టర్ కొట్టి ఇండస్ట్రీలో హాట్ టాపిక్‍గా అయిపోయారు. ప్రస్తుతం తెలుగు సినీ పరిశ్రమలో టాప్ 5 సినిమాల్లో రెండు కొరటాల శివ సినిమాలే ఉండడం విశేషంగా చెప్పుకోవాలి. ఈ నేపథ్యంలోనే అయన తదుపరి సినిమా ఎలా ఉండబోతుందన్నది ఇప్పుడు అంతటా ఆసక్తికరంగా మారిపోయింది. కొరటాల శివ తదుపరి సినిమా సూపర్ స్టార్ మహేష్‌తో ఉండనున్నట్లు కొద్దిరోజుల క్రితమే అనౌన్స్ అయిన విషయం తెలిసిందే.

‘శ్రీమంతుడు’ లాంటి బ్లాక్‌బస్టర్ ఇచ్చిన ఈ కాంబినేషన్‌లో వచ్చే సినిమా కావడంతో ఇప్పట్నుంచే మహేష్-కొరటాల రెండో సినిమా గురించి అభిమానులు మాట్లాడుకుంటూ వస్తున్నారు. ఇక ఈ సినిమా గురించి కొరటాల శివ మాట్లాడుతూ.. “మహేష్‌తో చేయబోయే రెండో సినిమా కూడా శ్రీమంతుడు లానే మంచి కథతో ఉంటుంది.” అని అన్నారు. అదేవిధంగా జనవరి నెలలో ఈ సినిమా సెట్స్‌పైకి వెళుతుందని, ప్రస్తుతం మహేష్ ఇమేజ్‌కు సరిపడేలా పూర్తి స్క్రిప్ట్ సిద్ధం చేస్తున్నానని కొరటాల తెలిపారు. డీవీవీ దానయ్య ఈ సినిమాను నిర్మించనున్నారు.