మహేష్ – కొరటాల శివ సినిమా రిలీజ్ డేట్!

Mahesh-Babu-Koratala-Shiva

సూపర్ స్టార్ మహేష్ – దర్శకుడు కొరటాల శివల కాంబినేషన్‌లో వచ్చిన ‘శ్రీమంతుడు’ అనే సినిమా ఎంతటి విజయం సాధించిందో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఇప్పుడిదే కాంబినేషన్‌లో రెండో సినిమా గత నెలలో పూజా కార్యక్రమాలతో ప్రారంభమైన విషయం తెలిసిందే. వచ్చే ఏడాది జనవరిలో సెట్స్‌పైకి వెళ్ళనున్న ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఇక ఈ సినిమాకు అప్పుడే ఒక విడుదల తేదీని కూడా ఫిక్స్ చేశారు.

వచ్చే ఏడాది దసరా సీజన్‌కు సినిమా వస్తుందని ముందే ప్రకటించిన టీమ్, ఆ క్రమంలోనే సెప్టెంబర్ 22వ తేదీని విడుదల తేదీగా ఖరారు చేసింది. దసరాకు సరిగ్గా పదిరోజుల ముందు వచ్చి సినిమా సీజన్ సందడిని మొదలుపెట్టనుంది. ‘భరత్ అనే నేను’ అన్న టైటిల్‌తో తెరకెక్కనున్న ఈ సినిమా కోసం మహేష్ ఇమేజ్‌కు సరిపడే సూపర్ స్కిప్ట్ సిద్ధం చేస్తున్నారట కొరటాల శివ. రవి కే.చంద్రన్, దేవిశ్రీ ప్రసాద్ లాంటి టాప్ టెక్నీషియన్స్ పనిచేస్తోన్న ఈ సినిమాకు కొరటాల శివ ఓ కొత్త హీరోయిన్‌ను ఎంపిక చేసే పనిలో ఉన్నారు.