స్పీడు తగ్గించేదిలేదంటున్న మహేష్ !


సూపర్ స్టార్ మహేష్ బాబు స్టార్ డైరెక్టర్ మురుగదాస్ డైరెక్షన్లో చేస్తున్న సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఇప్పటికే చెన్నై, అహ్మదాబాద్, హైదరాబాద్ లలో షెడ్యూల్స్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం త్వరలో మరో కీలక షెడ్యూల్ ను ప్రారంబించనుంది. నిన్ననే హైదరాబాద్ షెడ్యూల్ పూర్తవగా ముంబైలో షెడ్యూల్ మొదలుపెట్టేందుకు టీమ్ సన్నాహాలు చేస్తోంది. ఈ షెడ్యూల్లోనే కొన్ని కీలకమైన యాక్షన్ ఎపిసోడ్లు సైతం చిత్రీకరిస్తారని తెలుస్తోంది. దీని తరువాత బ్యాంకాక్ లో మరో షెడ్యూల్ ఉంటుందని సమాచారం.

మహేష్ బాబు కూడా ఎక్కడా గ్యాప్ ఇవ్వకుండా షూటింగ్లో పాల్గొంటూ సినిమాను అనుకున్న సమయానికి ఫినిష్ చేసి వేసవి సెలవులకు ప్రేక్షకుల ముందుకు రావాలని ప్లాన్ చేస్తున్నాడు. ఇకపోతే ఈ చిత్రం యొక్క ఫస్ట్ లుక్ నిన్న రిపబ్లిక్ డే సందర్బంగా విడుదల చేస్తారని అభిమానులు ఆశించగా టీమ్ మాత్రం విడుదలను వాయిదా వేసింది. దీంతో ఫ్యాన్స్ కాస్త నిరుత్సాహానికి గురయ్యారు. మరోవైపు చిత్ర యూనిట్ సినిమా చాలా బాగా వస్తోందని, అభిమానుల అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా ఉంటుందని చెప్తున్నారు. మహేష్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ గా కనిపించనున్న ఈ చిత్రంలో రకుల్ ప్రీత్ హీరోయిన్ గా నటిస్తోంది.