సమీక్ష : మజిలీ – భార్యభర్తల ఎమోషనల్ జర్నీ !

Majili movie review

విడుదల తేదీ : ఏప్రిల్ 05, 2019

123తెలుగు.కామ్ రేటింగ్ : 3.25/5

నటీనటులు : సమంత, నాగ చైతన్య, దివ్యంశ కౌశిక్, రావు రమేష్, పోసాని కృష్ణ మురళి త‌దిత‌రులు.

దర్శకత్వం : శివ నిర్వాణ

నిర్మాత :  సాహు గారపాటి , హరీష్ పెద్ది

సంగీతం : గోపి సుందర్, తమన్

‘ఏమాయచేసావే, ఆటో నగర్ సూర్య, మనం’ చిత్రాలు కలిసి చేసిన సమంత, నాగ చైతన్య మళ్లీ ఇన్నాళ్లకు కలిసి శివ నిర్వాణ దర్శకత్వంలో నటించిన చిత్రం మజిలీ. పెళ్లి తర్వాత చైతు, సమంత కలిసి నటిస్తున్న తొలి చిత్రం ఇదే కావడంతో ఈ చిత్రం భారీ అంచనాలు ఉన్నాయి. మరి ఈ రోజు విడుదల అయిన ఈ చిత్రం ఆ అంచనాలను ఏ మేరకు అందుకోగలిగిందో సమీక్షలోకి వెళ్లి తెలుసుకుందాం !

 

కథ :

పూర్ణ (నాగచైతన్య) ఎలాంటి బాధ్యతలు లేకుండా తాగుతూ.. ప్రేమించిన అమ్మాయినే తలచుకుంటూ కాలం గడుపుతూ తిరుగుతూ ఉంటాడు. అయితే ఇలాంటి వ్యక్తి జీవితంలోకి భర్తే ప్రాణం గా ప్రేమించే శ్రావణి (సమంత ) వస్తోంది. పూర్ణ ఎలా ఉన్నా ఏమి చేసినా గుడ్డిగా భర్తేకే సపోర్ట్ చేస్తూ ఉంటుంది. ఆ తరువాత జరిగే కొన్ని నాటకీయ పరిణామాల మధ్య వాళ్ళ జీవితంలోకి మీరా అనే పాప వస్తోంది.

ఆ తరువాత ఆ పాప కారణంగా వాళ్ళ జీవితాలు ఎలా మారాయి. డిప్రెషన్ లో ఉన్న పూర్ణ ఎలా మారాడు ? శ్రావణి అంటే ఎలాంటి ఫీలింగ్ లేని పూర్ణ ఆమెను భార్యగా ఎలా చూసాడు ? ఈ క్రమంలో వీరిద్దరి బంధం ఎలా కొనసాగింది? అసలు పూర్ణ అలా మారడానికి గల అమ్మాయి ఎవరు ? ఎందుకు వాళ్లు ఇద్దరూ విడి పోయారు ? పూర్ణ చివరకి మారాడా ? లేదా ? లాంటి విషయాలు తెలియాలంటే ఈ సినిమాను వెండి తెర పై చూడాల్సిందే.

 

ప్లస్ పాయింట్స్ :

ప్లస్ పాయింట్స్ గురించి మాట్లాడుకుంటే ముందుగా నాగ చైతన్య, సమంత తమ పాత్రలకు ప్రాణం పోశారు. అలాగే శివ నిర్వాణ రాసిన కథ మరియు పాత్రలు కూడా మిడిల్ క్లాస్ వాళ్ళ జీవితాల్లోని సంఘటనలు పరిస్థితుల ఆధారంగా సాగుతూ ఆకట్టుకుంటాయి. ముఖ్యంగా కథను దర్శకుడు చాలా సున్నితంగా నడుపుతూ.. సినిమాలో ప్రేమతో పాటు ఆ ప్రేమలోని ఎమోషన్ని, పెయిన్ని కూడా హైలెట్ అయ్యే విధంగా కొన్ని ఎమోషనల్ సన్నివేశాలను బాగా మలిచాడు.

ఇక సినిమాలో క్రికెటర్ గా అలాగే ఏ పని చెయ్యని భర్తగా నటించిన చైతు చక్కని నటనను కనబరిచాడు. గత తన సినిమాల్లో కంటే ఈ సినిమాలో ఇటు యంగ్ క్యారెక్టర్ లో తన శైలి నటనతో ఆకట్టుకోవడంతో పాటు.. అటు పెళ్లి అయిన తరువాత తాగుబోతు భర్తగా చాలా బాగా నటించాడు. ముఖ్యంగా ఎమోషనల్ సన్నివేశాల్లో సెటిల్డ్ పెర్ఫార్మెన్స్ తో తన పాత్రకి పూర్తి న్యాయం చేశాడు. మెయిన్ గా సెకెండ్ హాఫ్ లో సమంతతో సాగే సన్నివేశాలు అలాగే క్లైమాక్స్ లో సమంతకి తన ప్రేమ గురించే చెప్పే సందర్భంలో కానీ చైతు నటన సినిమాకే హైలెట్ గా నిలుస్తోంది. అలాగే నాగ చైతన్యకి దివ్యంశ కౌశిక్ కి మధ్య కెమిస్ట్రీ కూడా బాగా అలరిస్తుంది.

ఇక కథానాయకులుగా నటించిన సమంత, దివ్యంశ కౌశిక్ తమ పాత్రల్లో చాలా చక్కగా నటించారు. దివ్యంశ కౌశిక్ తన స్క్రీన్ ప్రెజెన్స్ తో పాటుగా తన నటనతోనూ ఆకట్టుకుంది. ఇక సమంత కొన్ని ఎమోషనల్ సీన్స్ లో ఆ పెయిన్ అర్ధమయ్యేలా కేవలం తన కళ్లల్లో ఆమె పలికించిన హావభావాలు మెచ్చుకోదగినవి.

చైతుకు తండ్రి పాత్రలో నటించిన రావు రమేష్ తన నాచ్యురల్ నతనతో ఆకట్టుకోగా.. ఎప్పటిలాగే తన శైలి పాత్రలో కనిపించిన పోసాని కూడా బాగా చేసారు. వీళ్లు తమ కామెడీ టైమింగ్ తో మ్యానరిజమ్స్ తో అక్కడక్కడ బాగానే నవ్వించారు. ఇక మిగిలిన నటీనటులు కూడా తమ పాత్ర పరిధి మేరకు బాగా నటించారు.

 

మైనస్ పాయింట్స్ :

భర్తే ప్రాణం అని నమ్మే ఒక మంచి భార్య పాత్రను అలాగే ప్రేమలో ఫెయిల్ అయిన ఒక భగ్న ప్రేమికుడికి జీవితంలోని సంఘటనలను బాగా రాసుకున్న దర్శకుడు శివ నిర్వాణ, స్క్రీన్ ప్లే ని మాత్రం ఆ స్థాయిలో ఆకట్టుకునే విధంగా రాసుకోలేదు. ముఖ్యంగా సినిమాలోని చాలా సన్నివేశాలను బాగా స్లోగా నడిపారు.

ఫస్ట్ హాఫ్ లో కొన్ని సీన్స్ మినహా మిగతా చాలా సీక్వెన్స్ పూర్తి స్థాయిలో ఆకట్టుకోవు. ఇక సెకెండాఫ్ ని కాస్త ఎమోషనల్ గా నడుపుదామని దర్శకుడు బాగానే ప్రయత్నం చేసినప్పటికీ అది పెద్దగా వర్కౌట్ కాలేదు. కానీ సినిమాలో ఆయన చెప్పాలనుకున్న ప్రేమలో ఎమోషన్ తో పాటు పెయిన్ కూడా ఉంటుందనే కథాంశం బాగుంది.

 

సాంకేతిక విభాగం :

దర్శకుడు శివ నిర్వాణ భార్య భర్తలకు సంబంధించి మంచి పాయింట్ తీసుకున్నారు. అయితే సినిమాలో కొన్ని సీక్వెన్స్ స్లోగా నడిపారు. విష్ణు శర్మ సినిమాటోగ్రఫీ బాగుంది. సినిమాలో క్రికెట్ దృశ్యాలతో పాటు ఓ కాలనీలో జరుగుతున్న కథకు అనుగుణంగా ఆయన విజువల్స్ ను చాలా అందంగా చూపించారు.

ఇక సంగీత దర్శకుడు గోపి సుందర్ అందించిన పాటల్లో రెండు పాటలు ఆకట్టుకుంటాయి. ఇక తమన్ అందించిన నేపధ్య సంగీతం బాగుంది. ముఖ్యంగా సమంత , చైతుల మధ్య వచ్చే సన్నివేశాల్లో ఆయన అందించిన నేపధ్య సంగీతం చాలా బాగా ఆకట్టుకుంది. ప్రవీణ్ పూడి ఎడిటింగ్ బాగుంది. సినిమాలోని నిర్మాతలు పాటించిన ప్రొడక్షన్ వాల్యూస్ కూడా చాలా బాగున్నాయి.

 

తీర్పు:

ముందుగానే చెప్పుకున్నట్లు సమంత, నాగ చైతన్య జంటగా శివ నిర్వాణ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం ఎమోషనల్ గా సాగుతూ ఆకట్టుకుంది. దర్శకుడు శివ నిర్వాణ భార్య భర్తలకు సంబంధించి మంచి కథను తీసుకుని మంచి ఎమోషనల్ సన్నివేశాలతో బాగానే ఆకట్టుకున్నాడు. ముఖ్యంగా భర్తే ప్రాణం అని నమ్మే ఒక మంచి భార్య పాత్రను అలాగే ప్రేమలో ఫెయిల్ అయిన ఒక భగ్న ప్రేమికుడి జీవితంలోని సంఘటనలను ఆయన బాగా రాసుకున్నాడు. అయితే స్క్రీన్ ప్లే ని మాత్రం ఆ స్థాయిలో ఆకట్టుకునే విధంగా మలచలేకపోయారు. సినిమాలో కొన్ని సీక్వెన్స్ ను బాగా స్లోగా నడపడం సినిమాకి పెద్ద మైనస్ పాయింట్ గా నిలుస్తోంది. ఇక చైతు, సమంత తమ నటనతో సినిమాని మరో లెవల్ కి తీసుకు వెళ్లారు. మొత్తం మీద ఈ చిత్రం ఫ్యామిలీ ఆడియన్స్ ను బాగా మెప్పిస్తోంది. అలాగే మిగిలిన అన్నివర్గాల ప్రేక్షకులని కూడా బాగానే అలరిస్తుంది.

 

123telugu.com Rating : 3.25/5

Reviewed by 123telugu Team

Click here for English Review

Exit mobile version