
మోహన్ బాబు కుమార్తె మంచు లక్ష్మి.. నటిగా, నిర్మాతగా తానేంటో నిరూపించుకున్నారు. ఇప్పుడు తాజాగా ఆమె మరో పాత్రలో దర్శనమివ్వనున్నారు. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా)కు వైఎస్ ప్రెసిడెంట్‌గా మంచు లక్ష్మి ఎన్నికయ్యారు. తెలుగు చలన చిత్ర పరిశ్రమలో నటీనటుల సమస్యల పరిష్కారం కోసం ఏర్పాటైన ఈ అసోసియేషన్‌కు ఈనెల 29న ఎన్నికలు జరగనున్నాయి. ఉపాధ్యక్ష పదవులకు శివకృష్ణ, మంచు లక్ష్మిలు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అయితే అధ్యక్ష పదవికి మాత్రం ఎన్నిక తెప్పేదిలా లేదు. మిగతా పదవులకు కార్యనిర్వహక ఉపాధ్యక్షుడుగా తనికెళ్ళ భరణి, మా ప్రధాన కార్యదర్శిగా శివాజీ రాజా, కార్యదర్శిగా ఆలీ ఎన్నికయ్యారు.
అధ్యక్ష పదవికి ప్రముఖ హీరో రాజేంద్రప్రసాద్ పోటీ చేయనున్న సంగతి తెలిసిందే. గత రెండు దఫాలకు కార్యవర్గంలోని కొన్ని ఇతర పదవులకు పోటీ జరిగినా.. అధ్యక్షుడిని మాత్రం ఏకగ్రీవంగానే ఎన్నుకున్నారు. తాజాగా సీనియర్ నటి జయసుధ కూడా పోటీకి దిగడంతో ఎన్నిక అనివార్యమైంది. ప్రస్తుతం అధ్యక్ష పదవిలో కొనసాగుతున్న మురళీమోహన్ ఎంపీగా ఎన్నికవ్వడం చేత రాజకీయ కార్యకలాపాల్లో బిజీగా ఉన్నారు. ఇక ఆయన మళ్ళీ ఈ పదవి చేపట్టడానికి విముఖత చూపడంతో కొత్త పేర్లు తెరపైకి వచ్చాయి. మొన్నటివరకూ రాజేంద్రప్రసాద్ ఎన్నిక లాంచనమే అనుకున్న తరుణంలో జయసుధ రాకతో ఎన్నిక తప్పనిసరిగా మారింది.