డిసెంబర్‌కల్లా మణిరత్నం కొత్త సినిమా పూర్తవుతుందట!

mani-ratnam1
మణిరత్నం సినిమాలంటే, ఏళ్ళు గడిచినా ఎప్పటికప్పుడు కొత్తగా కనిపించేంత క్లాసిక్స్‌ అన్న పేరుంది. ఇండియన్ సినిమాకు గర్వ కారణంగా నిలిచిన దర్శకుల్లో ఒకరైన ఆయన, కొద్దికాలంగా ఓ సరైన కమర్షియల్ సక్సెస్ కోసం ఎదురుచూడగా, ‘ఓకే బంగారం’తో అది నెరవేరింది. ఇక ఆ సినిమా విజయంతో రెట్టించిన ఉత్సాహంతో ఆయన తన కొత్త సినిమా ‘కాట్రు వెళదిలై’ని శరవేగంగా పూర్తి చేస్తున్నారు. కార్తీ, అదితిరావు హైదరి హీరో, హీరోయిన్లుగా నటిస్తోన్న ఈ రొమాంటిక్ డ్రామా ఇప్పటికే చెన్నై, ఊటీల్లో రెండు షెడ్యూల్స్ పూర్తి చేసుకుంది.

తాజాగా జమ్ము కాశ్మీర్‌లోని లడఖ్‌లో జరగనున్న ఓ భారీ షెడ్యూల్ కోసం మణి సిద్ధమవుతున్నారు. లడఖ్‌లో పలు యాక్షన్ సన్నివేశాలతో పాటు కీలక సన్నివేశాలను చిత్రీకరించనున్నారు. ఇందుకు సంబంధించిన లొకేషన్స్‌ను కూడా మణి టీమ్ ఇప్పటికే పరిశీలించింది. ఇక డిసెంబర్ కల్లా షూటింగ్ మొత్తం పూర్తయ్యేలా మణి పక్కాగా షెడ్యూల్స్ ప్లాన్ చేశారట. మద్రాస్ టాకీస్ పతాకంపై మణిరత్నం స్వయంగా నిర్మిస్తోన్న ఈ సినిమాలో కార్తీ ఓ యుద్ధ విమాన పైలెట్‌గా కనిపించనున్నారు. వేసవి సీజన్ మొదట్లో సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.