మణిరత్నం సలహాను పాటిస్తోన్న రామ్ చరణ్!


మెగాస్టార్ చిరంజీవి వారసత్వాన్ని అందిపుచ్చుకొని సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన రామ్ చరణ్, ఆ తర్వాత తనదైన మార్క్ సృష్టించుకొని మెగా పవర్ స్టార్‌గా ఎదిగి దూసుకుపోతున్నారు. తాజాగా డిసెంబర్‌లో విడుదలైన ఆయన నటించిన హిట్ సినిమా ‘ధృవ’కి ముందు రామ్ చరణ్ సినిమాలు రొటీన్ అయిపోయాయన్న టాక్ వినిపించింది. దీంతో చాలా జాగ్రత్తలు తీసుకొని ఆయన ధృవతో ఓ డిఫరెంట్ కమర్షియల్ సినిమాను అందించారు. ఇక అదేవిధంగా ఇప్పుడు సుకుమార్ దర్శకత్వంలో చేస్తోన్న సినిమా కూడా చరణ్ గత చిత్రాలకు భిన్నంగా గ్రామీణ నేపథ్యంలో జరిగే కథ. ఇందులో రామ్ చరణ్ ఓ పల్లెటూరు యువకుడిగా కనిపించనున్నారు.

‘బ్రూస్‌లీ’ పరాజయం తర్వాత రామ్ చరణ్ సినిమాల ఎంపికలో కనిపిస్తోన్న ఈ మార్పుకి ఓ కారణం లెజెండరీ డైరెక్టర్ మణిరత్నం అని కూడా చెప్పొచ్చు. ఇండియన్ సినిమా గర్వించదగ్గ దర్శకుల్లో ఒకరుగా పేరున్న మణిరత్నం దర్శకత్వంలో రామ్ చరణ్ ఎప్పట్నుంచో ఒక సినిమా చేయాలనుకుంటున్నారు. వీరిద్దరి కాంబినేషన్‌లో సినిమాకు సంబంధించిన చర్చలు కూడా జరుగుతున్నాయి. ఇక ఈ క్రమంలోనే రామ్ చరణ్‌కు మణిరత్నం ఓ సలహా ఇచ్చారట. రొటీన్ కమర్షియల్ సినిమా చేస్తూ పోతే, తర్వాత ఎవ్వరూ మన సినిమాలను గుర్తించరని, కమర్షియల్ పంథాలోనే సాగినా, కాస్త కొత్తదనం ఉన్న సినిమాలు చేయమని మణిరత్నం ఇచ్చిన ఈ సలహా తనపై బలంగా పనిచేసిందని రామ్ చరణ్ కూడా తెలిపారు. ఈ సలహాను పాటిస్తూనే రామ్ చరణ్ తన పంథా మార్చి కొత్తదనమున్న సినిమాలు చేస్తున్నారని స్పష్టంగా తెలుస్తూనే ఉంది.