చరణ్ తో కుదరలేదు అందుకే చిరంజీవిగారిని అడిగానన్న మనోజ్ !

26th, February 2017 - 01:28:29 PM


రాకింగ్ స్టార్ మంచు మనోజ్ తాజాగా చేసిన ‘గుంటూరోడు’ చిత్రం మార్చి 3వ తేదీన రిలీజుకు సిద్ధంగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో మనోజ్ క్యారెక్టరైజేషన్ తో పాటు మరో అంశం కూడా అందరినీ అమితంగా ఆకర్షిస్తోంది. అదే మెగాస్టార్ చిరంజీవి ఇచ్చిన వాయిస్ ఓవర్. ఈ విషయంపై తాజాగా జరిగిన ఇంటర్వ్యూలో మనోజ్ మాట్లాడుతూ ‘ముందుగా ఈ చిత్రంలో ఎవరైనా పెద్ద స్టార్ తో వాయిస్ ఓవర్ చెప్పిద్దామనుకున్నాం. అప్పుడు నా ఏజ్ గ్రూప్ కాబట్టి చరణ్ అయితే బాగుంటుందని చరణ్ కి ఫోన్ చేసి అడిగాను.

చరణ్ కూడా ఓకే అన్నాడు. కానీ అతను వేరే ఊరిలో ఉండి మరో పది రోజుల వరకు వచ్చే పరిస్థితి లేకపోవడంతో నేనే మరుసటి రోజు చిరంజీవి అంకుల్ ఇంటికి బ్రేక్ ఫాస్ట్ కి వెళ్ళినప్పుడు అంకుల్ నాకొక హెల్ప్ కావాలని అడిగాను. వెంటనే ఆయన ఏమిటో చెప్పమన్నారు. ఇలా వాయిస్ ఓవర్ కావాలని అడిగాక ఆలోచించకుండా వెంటనే చెప్తానన్నారు. ఆ తర్వాత నాకు తెలీకుండానే శబ్దాలయ స్థూడియోలో వాయిస్ ఓవర్ చెప్పి నాకు ఫోన్ చేసి సరిగా వచ్చిందో లేదో చూసుకో, రాకపోతే మళ్ళీ చెప్తాను ఆన్నారు. ఆయన హెల్పింగ్ నేచర్ కి చాలా సంతోషమేసింది. ఈ విషయం చరణ్ కి చెబితే అతను కూడా చాలా హ్యాపీగా ఫీలయ్యాడు’ అన్నారు.