మలేషియాలో జరిగిన ప్రతిష్టాత్మక ఉగాది పురస్కార్-2026 అవార్డుల్లో ‘మన్యం ధీరుడు’ ఉత్తమ చిత్రంగా నిలిచింది. మలేషియా తెలుగు సంఘం (క్లాంగ్ శాఖ) ఆధ్వర్యంలో సుందర్ పెరుమాళ్ ఆలయ ఆడిటోరియంలో జరిగిన ఉగాది వేడుకల్లో ఈ పురస్కారాన్ని అందజేశారు.
ఈ వేడుకల్లో చిత్ర హీరో, నిర్మాత ఆర్.వి.వి. సత్యనారాయణ, పార్వతీదేవి దంపతులు ముఖ్య అతిథిగా విచ్చేసిన క్లాంగ్ ఉత్తర జిల్లా పోలీస్ కమిషనర్ విజయరావు చేతుల మీదుగా ఈ ప్రతిష్టాత్మక అవార్డును అందుకున్నారు. మలేషియా తెలుగు సంఘం చైర్మన్ సుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో గౌరవ అతిథి సుబ్రమణ్యం రామానాయుడుతో పాటు సుమారు 600 మంది తెలుగు సంఘం సభ్యులు పాల్గొన్నారు.
విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు గాథను తెరకెక్కించి, తెలుగువారి ఆత్మగౌరవాన్ని, భారతీయ ఔన్నత్యాన్ని చాటిన ఆర్.వి.వి. సత్యనారాయణను పోలీస్ కమిషనర్ విజయరావు ప్రత్యేకంగా అభినందించారు. ఈ చిత్రంలో ప్రతి పౌరుడిలో స్ఫూర్తి నింపేలా అద్భుతమైన దేశభక్తి గీతాన్ని రూపొందించారని ఆయన ప్రశంసించారు.
