ప్రీ రిలీజ్ బిజినెస్‌లో సత్తా చాటుతోన్న ‘సింగం 3’

7th, August 2016 - 05:19:39 PM

suriya
‘గజిని’ సినిమాతో తెలుగులో గుర్తింపు తెచ్చుకున్న తమిళ హీరో సూర్యను తెలుగులో స్టార్‌ను చేసింది.. ‘సింగం'(యముడు), ‘సింగం 2′(సింగం) సినిమాలనే చెప్పుకోవాలి. తెలుగు, తమిళ భాషల్లో సూపర్ హిట్‌గా నిలిచిన ఈ సిరీస్‌లో మూడో సినిమాగా వస్తోన్న ‘సింగం 3’ ప్రస్తుతం సౌతిండియన్ సినిమాల్లో సెట్స్‌పై ఉన్న వాటిల్లో క్రేజ్ ఉన్న ఓ సినిమాగా చెప్పుకోవచ్చు. దీంతో ఈ సినిమా ఎవ్వరూ ఊహించని స్థాయిలో ప్రీ రిలీజ్ బిజినెస్ చేస్తోంది.

ఇప్పటికే తమిళనాట ఈ సినిమా డిస్ట్రిబ్యూషన్ హక్కులను భారీ మొత్తాలకు కొనుగోలు చేయగా, తెలుగు వర్షన్ కూడా సుమారు 18 కోట్లకు అమ్ముడైనట్లు సమాచారం. సూర్యకు తెలుగులో ఇదే రికార్డు బిజినెస్. ఇక ప్రముఖ నిర్మాత మల్కాపురం శివకుమార్ భారీ పోటీలో తెలుగు వర్షన్ హక్కులను సొంతం చేసుకున్నారు. అన్ని ప్రాంతాల్లో కలిపి ‘సింగం 3’ సుమారుగా 100 కోట్ల ప్రీ రిలీజ్ చేయబోతోందని ట్రేడ్ అంచనా వేస్తోంది. స్టూడియో గ్రీన్ సంస్థతో కలిసి సూర్య సంయుక్తంగా నిర్మిస్తోన్న ఈ సినిమాలో అనుష్క, శృతి హాసన్‌లు హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ సింగం సిరీస్‌లో గత రెండు సినిమాలకు దర్శకత్వం వహించిన హరి, మూడో సినిమాకూ దర్శకత్వం వహిస్తున్నారు.