చిరంజీవి కోసం భారీగా ప్లాన్ చేసిన మెగా అభిమానాలు !

18th, December 2016 - 11:43:36 AM

khaidi-150
మెగాస్టార్ చిరంజీవి 150వ చిత్రం ‘ఖైదీ నెం 150’ చిత్రాన్ని అనౌన్స్ చేసిన వెంటనే తెలుగు రాష్ట్రాల్లో ఉన్న మెగా అభిమానులంతా ఒక్కసారిగా విజృంభించారు. రెట్టించిన ఉత్సాహంతో సినిమా కోసం పనిచేస్తున్నారు. ప్రస్తుతం సినిమా షూటింగ్ అంతా పూర్తై జనవరి నెల సంక్రాంతికి రిలీజ్ అవుతుండగా సినిమా భారీ విజయాన్ని సాధించాలని రెండు రాష్ట్రాల్లో ఉన్న అభిమాన సంఘాలన్నీ కలిసికట్టుగా పనిచేయాలని నిర్ణయించుకున్నాయి. అందుకే ఈరోజు ఉదయం విజయవాడలో అఖిల భారత చిరంజీవి యువత ఆధ్వర్యంలో భారీ మీటింగును ఏర్పాటు చేసుకున్నారు.

ఈ మీటింగులో రెండు రాష్ట్రాలకు సంబందించి ముఖ్య కార్యకర్తలంతా పాల్గొని సినిమా ప్రమోషన్లు ఏ విధంగా చేయాలి, జిల్లా స్థాయి నుండి గ్రామ స్థాయి వరకూ సినిమాను జనాల్లోకి ఎలా తీసుకెళ్లాలి అనే అంశాలపై చర్చలు జరిపి పూర్తి ప్రణాళికను సిద్ధం చేసుకోనున్నారు. మరోవైపు ఈరోజు సాయంత్రం ఖైదీ సినిమాలోని ‘అమ్మడు లెట్స్ డు కుమ్ముడు’ పాట రిలీజ్ కానుంది. అలాగే ప్రీ రిలీజ్ కార్యక్రమం కూడా జనవరి మొదటి వారంలో చేయాలని ప్లాన్ చేస్తున్నారు. వినాయక్ డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రాన్ని మెగా తనయుడు చరణ్ స్వయంగా నిర్మిస్తున్నాడు.