‘కాటమరాయుడి’ క్రేజ్ ని క్యాష్ చేసుకోవాలనుకుంటున్న మెగా హీరో !


మెగా హీరో వరుణ్ తేజ్ ప్రస్తుతం ‘మిస్టర్, ఫిదా’ అనే రెండు సినిమాలు చేస్తున్నాడు. వీటిలో శ్రీను వైట్ల డైరెక్ట్ చేస్తున్న ‘మిస్టర్’ ముగింపు దశకు చేరుకుంది. ఇప్పటికే రిలీజైన ఫస్ట్ లుక్, టీజర్లు బాగుండటంతో ఈ సినిమాపై పాజిటివ్ క్రేజ్ నెలకొంది. దీంతో చిత్ర యూనిట్ మరో అడుగు ముందుకేసి ట్రైలర్ తో మరింత ప్రచారం పొందాలనే ఉద్దేశ్యంతో ఒక మాస్టర్ ప్లాన్ రెడీ చేసింది. ఆ ప్లాన్ ఏమిటంటే ఈ చిత్ర ట్రైలర్ ను మార్చి 24 నుండి పవన్ కళ్యాణ్ నటించిన ‘కాటమరాయుడు’ రిలీజ్ కానున్న అన్ని థియేటర్లలో ప్రదర్శించడం.

సాధారణంగానే పవన్ సినిమాకు క్రేజ్ ఎక్కువ కనుక 24వ తేదీ నుండి థియేటర్లన్నీ మెగా అభిమానులతో నిండిపోతాయి. దీంతో వరుణ్ తేజ్ సినిమా చాలా సులభంగా అభిమానుల్లోకి వెళ్ళిపోయే అవకాశముంది. ఇక పవన్ సినిమాతో పాటు ‘మిస్టర్’ ట్రైలర్ కూడా అభిమానులు మెచ్చే విధంగా ఉంటే ఆ రీచ్ మరింత ప్రభావవంతంగా ఉంటుంది. మొత్తం మీద వరుణ్ తేజ్ కాటమరాయుడి క్రేజ్ ను బాగా క్యాష్ చేసుకోవాలనుకుంటున్నాడన్నమాట. ఇకపోతే ఈ చిత్రంలో వరుణ్ తేజ్ సరసన హెబ్బా పటేల్, లావణ్య త్రిపాఠిలు హీరోయిన్లుగా నటిస్తున్నారు.