మెగాస్టార్ 151వ సినిమాలో మరో మెగాస్టార్ !
Published on May 26, 2017 5:00 am IST


తన 150వ చిత్రం ‘ఖైదీ నెం.150’ తో గ్రాండ్ గా రీ ఎంట్రీ ఇచ్చిన మెగాస్టార్ చిరంజీవి 151వ సినిమాకి సన్నద్ధమవుతున్న సంగతి తెలిసిందే. స్వాతంత్ర్య సమరయోధుడు ‘ఉయ్యాలవాడ నరసింహారెడ్డి’ జీవితం ఆధారంగా తెరకెక్కనున్న ఈ చిత్రంపై అభిమానుల్లో, ప్రేక్షకుల్లో భారీ స్థాయి అంచనాలున్నాయి. ఆ అంచనాలకు తగ్గట్టే నిర్మాత రామ్ చరణ్ కూడా ఎక్కడా రాజీ పడకుండా భారీ బడ్జెట్ తో, ప్రముఖ తారాగణంతో సినిమా నిర్మాణానికి ఏర్పాటు చేస్తున్నారు.

అయితే తాజాగా ఈ సినిమా గురించి వినిపిస్తున్న వార్తల ప్రకారం బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ ఈ చిత్రంలో ఒక కీ రోల్ చేయనున్నారని అంటున్నారు. ఇప్పటికే ఆయనకు కథను వినిపించారని, బిగ్ బీ కూడా చిత్రం పట్ల సుముఖంగానే ఉన్నారని తెలుస్తోంది. అయితే ఇంకా ఆయన తన ఖచ్చితమైన అభిప్రాయాన్ని వెల్లడించలేదు. గతంలోనే చిరంజీవితో నటించాలని ఉందని చెప్పిన అమితాబ్ మరి ఈ సినిమాకు ఓకే చెప్తారో లేదో చూడాలి.

 
Like us on Facebook