చైతు ఎప్పుడూ ఒకేలా ఉంటాడు – మెగాస్టార్

చైతు ఎప్పుడూ ఒకేలా ఉంటాడు – మెగాస్టార్

Published on Sep 19, 2021 8:40 PM IST

అక్కినేని నాగచైతన్య – క్రేజీ బ్యూటీ సాయి పల్లవి జంటగా వస్తోన్న ఫీల్ గుడ్ సినిమా “లవ్ స్టోరి”. దర్శకుడు శేఖర్ కమ్ముల రూపొందించిన ఈ సినిమా సెప్టెంబర్ 24న థియేటర్ లలో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతోంది. దాంతో చిత్ర ప్రచార కార్యక్రమాలు ఊపందుకున్నాయి. తాజాగా “లవ్ స్టోరి” అన్ ప్లగ్ డ్ ఈవెంట్ ను హైదరాబాద్ లోని ఓ హోటల్ లో గ్రాండ్ గా నిర్వహించారు. మెగాస్టార్ చిరంజీవి, బాలీవుడ్ సూపర్ స్టార్ అమీర్ ఖాన్ అతిథులుగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతూ… ‘కరోనా లాక్ డౌన్ తర్వాత పిల్లలు స్కూల్ కు వెళ్తే ఎంత సంతోషంగా ఉంటుందో, ఇప్పుడు ఇలా సినిమా ఫంక్షన్స్ కు రావడం అంతే సంతోషంగా ఉంది. సినిమా కార్యక్రమాల్లో మిత్రులను కలిసి, ప్రేక్షకుల చప్పట్లు విని చాలా రోజులు అవుతుంది. ఈ మధ్య నన్ను ఎవరైనా టీజర్, ట్రైలర్ లాంఛ్ చేయమని అడిగితే, ఇంట్లో కూర్చుని లాప్ టాప్ లో చేస్తూ ఉన్నాను. కానీ బయటకొచ్చి ఆడియెన్స్ చప్పట్లు వింటే వచ్చే సంతోషం వేరు. నారాయణదాసు నారంగ్ గారు నాకు ఎన్నో ఏళ్లుగా మిత్రులు. ఆయన 80 వ దశకంలో డిస్ట్రిబ్యూషన్, ఎగ్జిబిషన్ రంగంలోకి లోకి వచ్చినప్పటి నుంచి నాకు సన్నిహిత సంబంధం ఉంది. ఆయన నాకు గురువులా భావిస్తాను.

ఫిల్మ్ ఇండస్ట్రీకి భీష్మాచార్యులు వంటివారు. ఏషియన్ ఫిల్మ్స్ నిర్మాణ రంగంలోకి రావడం సంతోషకరం. నారాయణదాసు గారి అబ్బాయి సునీల్ తండ్రిని మించిన తనయుడు. ఇవాళ భారతదేశంలోనే ఎక్కువగా మల్టీప్లెక్స్ థియేటర్స్ హైదరాబాద్ లో ఉన్నాయంటే కారణం సునీల్ నారంగ్ లాంటి వాళ్ల కృషి వల్లే. “లవ్ స్టోరి” టైటిల్ విన్నప్పుడు చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపించింది. ప్రేమ కథలు చూసి చాలా కాలం అవుతోంది. నా స్నేహితుడు నాగార్జున గారి అబ్బాయి నటించాడు. ఇందాక అమీర్ ఖాన్ నాతో నాగ చైతన్య గురించి చెప్పారు. లాల్ సింగ్ చద్దాలో నటించాడు. చాలా కంఫర్ట్ గా అనిపించింది, మంచి యాక్టర్ అని. ఆ మాట వింటే నాకూ సంతోషమేసింది. నాగ చైతన్య మంచి వ్యక్తి. చైతూ ఎప్పుడూ ఒకేలా సంమయనం తో ఉంటాడు.

నాగార్జున లాంటి కూల్ ఫాదర్ కు చైతూ లాంటి కూల్ సన్ ఉన్నాడు. ఇండస్ట్రీతో నాగ చైతన్య జర్నీ కూడా నిర్మాణాత్మకంగా సాగుతోంది. ఆయన సుదీర్ఘ కాలం ప్రయాణం చేసేందుకు ఇది బాగా ఉపయోగపడుతుంది. చైతూ మంచి కథలు ఎంచుకుంటాడు, “లవ్ స్టోరి” కూడా అలాగే ఉంటుందని ఆశిస్తున్నాను. ఆల్ ద బెస్ట్ చైతూ. నాగ చైతన్య, నా మిత్రుడు అమీర్ ఖాన్ కలిసి నటించిన సినిమా లాల్ సింగ్ చద్దా చూడాలని వేచి చూస్తున్నాను. నేనే ముంబై వచ్చి సినిమా చూస్తానని అమీర్ తో చెప్పాను. ఆయన లేదు నేనే వచ్చి ఇక్కడ హైదరాబాద్ లో మీకోసం ప్రొజక్షన్ వేయిస్తా అన్నారు. సో నైస్ ఆఫ్ హిమ్. టోక్యో ఎయిర్ పోర్ట్ లో అమీర్ ను కలిసినప్పుడు తనకు సినిమా మీదున్న ప్యాషన్ గురించి చెప్పాడు. ఫారెస్ట్ గంప్ సినిమాను హిందీలో రీమేక్ చేసేందుకు ఎలాంటి ప్రయత్నాలు చేస్తున్నాడో తెలిపాడు. సినిమా మీద అమీర్ ఖాన్ కు ఉన్న ప్రేమ చూసి నాకు ఆశ్చర్యం వేసింది. ఆయన హైదరాబాద్ వచ్చి, యంగ్ స్టార్స్ ను ఎంకరేజ్ చేస్తున్నందుకు చాలా థాంక్స్ అంటూ మెగాస్టార్ చెప్పారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు