మంచు మనోజ్ సినిమాలో మెగాస్టార్ పాత్ర !


అటాక్, శౌర్య’ వంటి వరుస పరాజయాలతో డీలా పడ్డ మంచు మనోజ్ ఈసారి ఖచ్చితంగా హిట్ అందుకోవాలనే ప్రయత్నంలో వరుసగా రెండు సినిమాలు చేస్తున్నాడు. ‘ఒక్కడు మిగిలాడు’, ‘గుంటూరోడు’ అనే రెండు సినిమాలను సిద్ధం చేస్తున్నారు. ఇప్పటికే పూర్తైన ‘గుంటూరోడు’ చిత్రాన్ని మొదట ఫిబ్రవరి నెలలో రిలీజ్ చేయాలని అనుకున్నారు. కానీ కొన్ని కారణాల వలన దాన్ని మార్చి 3కు మార్చారు. ఇప్పటికే ట్రైలర్స్, పాటలతో ఆకట్టుకున్న ఈ చిత్రం ఇప్పుడు మరో కొత్త ఆకర్షణతో ముందుకొచ్చింది.

అదేమిటంటే ఈ సినిమాలో మెగాస్టార్ చిరంజీవి పాత్ర కూడా ఉంది. పాత్ర అంటే కథలో కదిలే పాత్ర కాదు. కథలో వినిపించే పాత్ర. క్లుప్తంగా చెప్పాలంటే చిరు ఈ చిత్రానికి వాయిస్ ఓవర్ అందించారట. సినిమాలోని ఒక కీలక సమయంలో చిరు వాయిస్ ఓవర్ వినిపిస్తోందని అంటున్నారు. చిరంజీవి గత శుక్రవారం విడుదలై మంచి సక్సెస్ దిశగా దూసుకుపోతున్న ‘ఘాజి’ చిత్రానికి కూడా తన వాయిస్ ఓవర్ ఇచ్చిన సంగతి తెలిసిందే. నూతన దర్శకుడు సత్య దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్‌గా నటించింది.