మెగాస్టార్ టీవీ షో ప్రోమోకు రంగం సిద్ధం!

chiranjeevi
మెగాస్టార్ చిరంజీవి చాలాకాలం తర్వాత తన 150వ సినిమా ఖైదీ నెం. 150తో అభిమానులను అలరించేందుకు సిద్ధమవ్వడం ఒక విశేషమైతే, తాజాగా ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’ అనే ఓ టీవీ షోకు హోస్ట్‌గా వ్యవహరించనుండడం మరో విశేషం అయింది. గతంలో నాగార్జున ఆధ్వర్యంలో నడిచిన ఈ సక్సెస్‌ఫుల్ షో కొత్త సీజన్‌కు చిరు హోస్ట్‌గా వ్యవహరించనున్నారు. ఇక ఇందుకు సంబంధించిన పనులను కూడా మీలో ఎవరు కోటీశ్వరుడు టీమ్ ఇప్పటికే మొదలుపెట్టిందట. అక్టోబర్ మొదటివారంలో ఈ షోలో చిరు ఎలా ఉండనున్నారో పరిచయం చేస్తూ ఓ ప్రోమో విడుదల కానుందని తెలిసింది.

చిరంజీవి ఈ షో కోసం కొద్దిరోజులపాటు ప్రత్యేక రిహార్సల్స్ కూడా చేశారట. వెండితెరపై కోట్లాది అభిమానులను సంపాదించిన చిరు చేస్తోన్న మొట్టమొదటి అతిపెద్ద టీవీ షో కావడంతో ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’ కొత్త సీజన్‌పై అంచనాలన్నీ తారాస్థాయిలో ఉన్నాయి. ఇక ఖైదీ నెం 150 విషయానికి వస్తే ఇప్పటికే 50% పైగా షూటింగ్ పూర్తి చేసుకున్న సినిమా సంక్రాంతి కానుకగా విడుదల కానుంది.