ఓటీటీ సమీక్ష : మేము ‘కాప్’లం – జీ5లో తెలుగు వెబ్ సిరీస్

ఓటీటీ వేదిక : జీ5
ఓటీటీ స్ట్రీమింగ్ తేదీ : మే 22, 2026

123తెలుగు.కామ్ రేటింగ్ : 2.5/5

నటీనటులు : నాగబాబు, గెటప్ శ్రీను, రవితేజ నన్నిమాల, రీతూ చౌదరి, చరణ్ లక్కరాజు, సిరి పార్వతి, కిరీటి దామరాజు తదితరులు
దర్శకత్వం : ప్రదీప్ మద్దాలి
నిర్మాత : బి.వి.ఎస్ రవి, కౌముది
సంగీతం : సాకేత్ కోమండూరి
సినిమాటోగ్రఫీ : కిషోర్ బోయిడపు
ఎడిటింగ్ : మైఖేల్ డి సిల్వా

సంబంధిత లింక్స్ : ట్రైలర్

ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ జీ5 లో సరికొత్త రూరల్ క్రైమ్ కామెడీ సిరీస్ ‘మేము కాప్‌లం’ తాజాగా స్ట్రీమింగ్‌కు వచ్చింది. నాగబాబు, గెటప్ శ్రీను, రవితేజ నన్నిమాల ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సిరీస్ ప్రేక్షకులను ఏ మేరకు మెప్పించిందో ఈ రివ్యూలో చూద్దాం.

కథ:

మహాదేవ పట్టణం గ్రామంలో ఊరి పెద్ద అయిన గజపతి రాజు(నాగబాబు) తన పందెం కోడి సలార్ రాజు‌ని ప్రాణంగా పెంచుకుంటాడు. సంక్రాంతి పందేలకు ముందు ఊరి జనానికి ఆయన ఓ పార్టీ ఇస్తాడు. అయితే, ఆ పార్టీ తర్వాత సలార్ రాజు కనిపించకుండా పోయాడు. దీంతో ఆ కోడిని వెతికే బాధ్యత ఆ ఊరి పోలీసులు అయిన ఎస్ఐ రవి(రవితేజ నన్నిమాల), కానిస్టేబుల్ మోహన్(గెటప్ శ్రీను)లపై పడుతుంది. ఇదే క్రమంలో గ్రామంలో కొందరు తీవ్ర అనారోగ్యానికి గురై ఆసుపత్రి పాలవుతారు. అసలు సలార్ రాజుని ఎవరు ఎత్తుకెళ్లారు..? ఊరిలో జనం అనారోగ్యం బారిన పడటానికి గల కారణం ఏమిటి..? ఆ ఊరిలో జరుగుతున్న అక్రమాలు ఏమిటి.. వాటి వెనుక ఉన్నది ఎవరు..? అనే ప్రశ్నలకు సమాధానమే ఈ వెబ్ సిరీస్ కథ.

ప్లస్ పాయింట్స్:

ఈ సిరీస్‌లో ప్రధాన బలం లీడ్ యాక్టర్స్ గెటప్ శ్రీను మరియు రవితేజ నన్నిమాల మధ్య కెమిస్ట్రీ. ఇద్దరు అమాయక, కన్ఫ్యూజ్డ్ కానిస్టేబుల్స్ పాత్రల్లో వీరిద్దరూ తమ కామెడీ టైమింగ్‌తో చాలా చోట్ల నవ్వించారు. ముఖ్యంగా కొన్ని గ్రామీణ వాతావరణం నేపథ్యంలో వచ్చే డైలాగ్స్, మిస్అండర్‌స్టాండింగ్స్ బాగున్నాయి.

మరో కీలక పాత్రలో కనిపించిన మెగా బ్రదర్ నాగబాబు తన నటనతో సిరీస్‌కు హెల్ప్ అయ్యారు. రూరల్ నేటివిటీ బ్యాక్‌డ్రాప్ మరియు విలేజ్ పాలిటిక్స్‌ని చూపించిన విధానం కొన్ని చోట్ల కనెక్ట్ అవుతుంది. ఒక పందెం కోడి చుట్టూ క్రైమ్ కామెడీని బిల్డ్ చేయాలనే ఆలోచన బాగుంది.

ఇక మిగిలిన నటీనటుల విషయానికి వస్తే సిరి పార్వతి, చరణ్ లక్కరాజు, రీతూ చౌదరి, కిరీటి దామరాజు తమ పాత్రల పరిధి మేర చక్కగా నటించారు. ఊరిలో జరిగే చేతబడుల డ్రామా మరియు రక్తపు వాంతుల మిస్టరీ ఎలిమెంట్స్ ద్వారా సెకండాఫ్‌లో కథను కాస్త మలుపు తిప్పే ప్రయత్నం చేయడం, క్యూరియాసిటీని పెంచే కొన్ని సస్పెన్స్ మూమెంట్స్ సిరీస్‌కు హెల్ప్ అయ్యాయి.

మైనస్ పాయింట్స్:

ఈ వెబ్ సిరీస్ కథలోని లైన్‌గా బాగున్నప్పటికీ, దాన్ని స్క్రీన్‌ప్లేగా మార్చడంలో దర్శకుడు పూర్తి స్థాయిలో సక్సెస్ కాలేకపోయాడు. 6 ఎపిసోడ్ల పాటు ఈ చిన్న పాయింట్‌ను లాగడం వల్ల చాలా చోట్ల కథనం నెమ్మదించింది. కొన్ని ఎపిసోడ్స్ సాగదీసినట్లు అనిపిస్తాయి.

కామెడీ కొన్ని చోట్ల పండినా, మరికొన్ని చోట్ల బలవంతంగా ఇరికించినట్లు అనిపిస్తుంది. క్రైమ్ మిస్టరీ అని ప్రమోట్ చేసినప్పటికీ, ఆ మిస్టరీ ఎలిమెంట్ అంత గ్రిప్పింగ్‌గా లేదు. క్లైమాక్స్ ట్విస్ట్ మరియు సస్పెన్స్ కూడా అంతగా థ్రిల్ చేయవు.

ముఖ్యంగా, సిరీస్‌లో బలమైన విలనిజం లేకపోవడం పెద్ద మైనస్. కథ ముగింపుకు వచ్చేసరికి క్లైమాక్స్ ట్విస్ట్‌లు మరియు సస్పెన్స్ రివీల్ అయ్యే విధానం చాలా ఫ్లాట్‌గా సాగుతుంది. కథలోని సబ్‌ప్లాట్స్‌గా వచ్చే లవ్ స్టోరీ మరియు రిపోర్టర్ ట్రాక్‌లు కూడా పెద్దగా వర్కవుట్ కాలేదని చెప్పాలి.

సాంకేతిక విభాగం:

దర్శకుడు ప్రదీప్ మద్దాలి ఎంచుకున్న పాయింట్ బాగున్నా, కథనాన్ని మరింత ఇంట్రెస్టింగ్‌గా రాసుకోవాల్సింది. కామెడీ, క్రైమ్ మిస్టరీ అంశాలను పక్కాగా ఎగ్జిక్యూట్ చేయడంలో ఆయన తడబడ్డారని చెప్పాలి. పల్లెటూరి వాతావరణాన్ని కెమెరామెన్ విజువల్స్‌గా బాగా క్యాప్చర్ చేశారు. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కొన్ని కామెడీ సీన్స్‌ను బాగానే ఎలివేట్ చేసింది. ఎడిటింగ్ విషయంలో ఇంకాస్త జాగ్రత్త పడాల్సింది. కొన్ని సాగదీత సీన్లను ట్రిమ్ చేయాల్సింది. నిర్మాణ విలువలు బాగున్నాయి.

తీర్పు:

ఓవరాల్‌గా చూసుకుంటే.. ‘మేము కాప్‌లం’ వెబ్ సిరీస్ రూరల్ క్రైమ్ కామెడీ డ్రామాగా అక్కడక్కడా కొన్ని నవ్వులను పంచుతుంది. గెటప్ శ్రీను, రవితేజ నన్నిమాల యాక్టింగ్ మరియు కొన్ని విలేజ్ కామెడీ సీన్స్ సిరీస్‌కు ప్లస్ అయ్యాయి. వీక్ స్క్రీన్‌ప్లే, స్లో నెరేషన్ బోర్ కొట్టిస్తాయి. క్రైమ్ కామెడీ సిరీస్‌లను ఇష్టపడేవారు ఈ వెబ్ సిరీస్‌ను తక్కువ అంచనాలతో చూడటం బెటర్.

123telugu.com Rating: 2.5/5

Reviewed by 123telugu Team

Exit mobile version