‘మైఖేల్’ బయోపిక్.. అవి చూడాలంటే సీక్వెల్ రావాల్సిందే..!

Michael

ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల మధ్య విడుదలైన మైఖేల్ జాక్సన్ బయోపిక్ ‘మైఖేల్’ ప్రస్తుతం మిక్సిడ్ రెస్పాన్స్‌తో రన్ అవుతోంది. రివ్యూలు ఎలా ఉన్నా, కింగ్ ఆఫ్ పాప్ అభిమానుల నుండి మాత్రం ఈ చిత్రానికి మంచి ఆదరణ లభిస్తోంది. అయితే, మైఖేల్ జాక్సన్ జీవితంలోని వివాదాస్పద అంశాలను, నెగటివ్ కోణాలను సినిమాలో సరిగ్గా చూపలేదని సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

ఈ నేపథ్యంలో, దర్శకుడు ఆంటోనీ ఫుక్వా ఈ సినిమా సీక్వెల్ గురించి ఒక ఆసక్తికరమైన అప్‌డేట్ ఇచ్చారు. “స్టేజ్ మీద ఆయన ఒక సూపర్ హీరో. కానీ సాధారణ మనుషుల్లాగే ఎవరూ పర్ఫెక్ట్ కాదు. ఒక మనిషి వ్యక్తిత్వాన్ని ఏ అంశాలు ప్రభావితం చేశాయో ప్రేక్షకులకు పూర్తిస్థాయిలో వివరించాలంటే రెండో భాగం అవసరం” అని ఆయన పేర్కొన్నారు. అంటే, మొదటి భాగంలో వదిలేసిన వివాదాస్పద అంశాలను సీక్వెల్‌లో చూపించే అవకాశం ఉందని ఆయన హింట్ ఇచ్చారు.

“మా దగ్గర ఇంకా చెప్పాల్సిన కథ చాలా ఉంది” అంటూ ఫుక్వా రెండో భాగంపై క్లారిటీ ఇచ్చారు. జాఫర్ జాక్సన్ టైటిల్ రోల్ పోషించిన ఈ చిత్రంలో నియా లాంగ్, మైల్స్ టెల్లర్, కోల్మన్ డొమింగో కీలక పాత్రలు పోషించారు. మరి పార్ట్-2లోనైనా మైఖేల్ జాక్సన్ జీవితంలోని ఆ చీకటి కోణాలను ఆవిష్కరిస్తారేమో చూడాలి.

Exit mobile version