ఆస్కార్ విజేత, ప్రముఖ సంగీత దర్శకుడు ఎం.ఎం.కీరవాణి ప్రస్తుతం ఎస్.ఎస్. రాజమౌళి ప్రతిష్టాత్మక చిత్రం ‘వారణాసి’ (Varanasi) పనుల్లో బిజీగా ఉన్నారు. మహేష్ బాబు హీరోగా నటిస్తున్న ఈ చిత్రం అడ్వెంచర్, ఫాంటసీ మరియు మైథాలజీ అంశాలతో రూపొందుతోంది. ఇక ఈ సినిమాను 2027 ఏప్రిల్ 7న ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ చేసేందుకు మేకర్స్ రెడీ అవుతున్నారు.
అయితే, తాజా సమాచారం ప్రకారం కీరవాణి మరో భారీ మైథాలజీ ఫాంటసీ చిత్రానికి సంగీతాన్ని అందించబోతున్నారు. బ్లాక్‌బస్టర్ చిత్రం ‘హను-మాన్’కు సీక్వెల్‌గా వస్తున్న ‘జై హనుమాన్’ చిత్రానికి కీరవాణి సంగీతం అందించనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాలో ‘కాంతార’ ఫేమ్ రిషబ్ శెట్టి హనుమంతుడిగా నటిస్తున్నారు. ఈ ప్రాజెక్టులోకి కీరవాణి రాకతో సినిమా స్థాయి మరింత పెరుగుతుందని, ముఖ్యంగా అంతర్జాతీయ స్థాయిలో ఈ చిత్రానికి మంచి గుర్తింపు లభిస్తుందని సినీ వర్గాలు భావిస్తున్నాయి.
మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ భారీ పాన్-ఇండియా చిత్రంలో దగ్గుబాటి రానా కూడా ఒక కీలక పాత్రలో నటించనున్నట్లు సమాచారం. ఈ సినిమాను ఫిబ్రవరి 22, 2026న చారిత్రక నగరమైన హంపీలో అట్టహాసంగా ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. మరి దీనిపై అధికారిక ప్రకటన ఎప్పుడు వస్తుందో చూడాలి.
