త్రిష ‘మోహిని’ లుక్ : బాగుందా? బాగోలేదా?

18th, October 2016 - 11:47:55 PM

mohini
గత కొద్దికాలంగా హీరోయిన్ ప్రధాన సినిమాల్లోనే ఎక్కువగా నటిస్తూ వస్తోన్న త్రిష, కొద్దినెలల క్రితమే నాయకి అనే హర్రర్ కామెడీతో రాగా, తాజాగా ‘మోహిని’ అనే మరో సినిమాను కూడా రిలీజ్‌కు సిద్ధం చేస్తున్నారు. లండన్, థాయ్‌ల్యాండ్‌లలో షూటింగ్ జరుపుకున్న ఈ సినిమా షూటింగ్ పార్ట్ దాదాపుగా పూర్తైందట. ఈ నేపథ్యంలోనే టీమ్ కొద్దిసేపటి క్రితం ఫస్ట్‌లుక్‌ను విడుదల చేసింది. వెస్ట్రన్ అవతారంలోని అమ్మవారిలా మోహిని ఫస్ట్‌లుక్ డిజైన్ చేశారు.

ఇక ఈ లుక్ విడుదలైన వెంటనే సోషల్ మీడియాలో రెండు రకాల స్పందనలు వినిపిస్తున్నాయి. త్రిష లాంటి టాప్ హీరోయిన్ ఇలా ఒక డిఫరెంట్ సినిమా చేయడంతో పాటు, లుక్‌ పరంగానూ ఇంత డిఫరెంట్‌గా కనిపించడం పెద్ద సాహసమే అని కొందరు ప్రశంసిస్తూ ఉండగా, మరికొందరు పెదవి విరిచేస్తున్నారు. ఈ లుక్‌లో త్రిష ఎబ్బెట్టుగా ఉన్నారని, ఇదేం లుక్ అంటూ విమర్శిస్తున్నారు. ఇలాంటి విభిన్న స్పందనలు తెచ్చుకున్న ఈ మోహిని, ట్రైలర్ రిలీజ్ తర్వాత ఎలా ఉంటుందో చూడాలి. ఆర్.మధేష్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది.