Mr Work From Home: ట్రాక్టర్లు, విత్తనాల మధ్య సినిమా పోస్టర్లు..ఆకట్టుకుంటున్న మూవీ టీమ్ కొత్త ప్లాన్

Mr Work From Home promotions

సినిమా తీయడం ఎంత కష్టమో, దాన్ని జనాల్లోకి తీసుకెళ్లడం ఇప్పుడు అంతకంటే పెద్ద సవాలు. భారీ బడ్జెట్ సినిమాలకైతే ప్రమోషన్స్ ఓ రేంజ్‌లో ఉంటాయి. కానీ, మంచి మెసేజ్‌తో వచ్చే చిన్న సినిమాలకు మాత్రం పబ్లిసిటీనే ప్రాణం. సరిగ్గా ఈ విషయాన్ని పసిగట్టిన ‘మిస్టర్ వర్క్ ఫ్రమ్ హోమ్’ (Mr. Work From Home) మూవీ టీమ్.. ప్రమోషన్స్ విషయంలో సరికొత్త రూటు ఎంచుకుంది. మాల్స్, కాలేజీల చుట్టూ తిరిగే రొటీన్ పద్ధతిని పక్కనపెట్టి, నేరుగా రైతుల మధ్యకే వెళ్లి తమ సినిమాను ప్రమోట్ చేసుకుంటోంది.

అగ్రి ఎక్స్‌పోల్లో మూవీ సందడి

సినిమాలో వ్యవసాయానికి సంబంధించిన అంశాలు ఉండటంతో, టీమ్ నేరుగా రైతులనే టార్గెట్ చేసింది. ఇటీవల హైదరాబాద్‌ ఎన్టీఆర్ స్టేడియంలో జరిగిన ‘రాజేందర్ రెడ్డి రైతుబడి అగ్రి షో’లో ఈ మూవీ యూనిట్ ప్రత్యేకంగా ఒక స్టాల్ ఏర్పాటు చేసింది. విత్తనాలు, ట్రాక్టర్ల మధ్య సినిమా పోస్టర్లు చూడగానే రైతులు ఆసక్తిగా స్టాల్ వద్దకు వచ్చారు. వారికి సినిమా కాన్సెప్ట్ ఏంటో టీమ్ స్వయంగా వివరించింది.

అంతేకాదు, మహిళా దినోత్సవం సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరైన ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం (PJTSAU) మెగా రైతు మేళాలోనూ ఈ మూవీ టీమ్ సందడి చేసింది. ఈ ఎక్స్‌పోకు వచ్చిన మంత్రులు, అధికారులు, వ్యవసాయ నిపుణులు ఈ వినూత్న ప్రమోషన్స్ చూసి చిత్ర యూనిట్‌ను మెచ్చుకున్నారు.

ఇంతకీ ఈ సినిమాలో ఏముందంటే.. స్మార్ట్ ఫార్మింగ్ చుట్టూ కథ నడుస్తుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI), ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ (IoT), బ్లాక్‌చెయిన్ లాంటి లేటెస్ట్ టెక్నాలజీని వాడుకుంటూ వ్యవసాయాన్ని ఎంత సులభంగా చేయొచ్చో ఇందులో చూపించారు. దీనికి తోడు ప్రస్తుత సమాజంలో వేగంగా పెరుగుతున్న విడాకుల సమస్యను కూడా టచ్ చేశారు. మోడ్రన్ లైఫ్‌స్టైల్‌కు సాంప్రదాయ కుటుంబ విలువలు ఎంత అవసరమో చర్చిస్తూనే, ఆద్యంతం వినోదాత్మకంగా సినిమాను మలిచారు.

త్రిగుణ్, పాయల్ రాధాకృష్ణ హీరో హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రంలో.. నవ్వులు పంచేందుకు ఏకంగా పది మందికి పైగా కమెడియన్లు రంగంలోకి దిగారు. సప్తగిరి, వేణు యెల్దండి, వైవా హర్ష, శివాజీ రాజా, అనిష్ కురువిల్లా, హర్ష వర్ధన్, సత్య కృష్ణన్, నెల్లూరు సుదర్శన్, గుండు సుదర్శన్, సరయు తదితరులు తమ టైమింగ్‌తో కడుపుబ్బా నవ్వించనున్నారు.

లోటస్ క్రియేటివ్ వర్క్స్ బ్యానర్‌పై అరవింద్ మండ్యం నిర్మిస్తున్న ఈ సినిమాకు మధుదీప్ చెలికాని దర్శకత్వం వహించారు. సీహెచ్.వి.ఎన్.ఎస్ బాబ్జి సమర్పిస్తున్న ఈ ప్రాజెక్ట్‌కు రవికుమార్ సినిమాటోగ్రఫీ, సీనియర్ ఎడిటర్ కోటగిరి వెంకటేశ్వరరావు ఎడిటింగ్ బాధ్యతలు చూసుకున్నారు. అరుణ్ చిల్వేరు, ప్రకాష్ చెరుకూరి సంగీతం అందించారు. ఇప్పటికే విడుదలైన టీజర్ నెట్టింట మంచి బజ్ క్రియేట్ చేస్తోంది. సెన్సార్ పనులు కూడా పూర్తి చేసుకున్న ‘మిస్టర్ వర్క్ ఫ్రమ్ హోమ్’.. ఈ వేసవి సెలవుల్లో థియేటర్లలో సందడి చేసేందుకు ఫుల్ రెడీగా ఉంది.

Exit mobile version