బాక్సాఫీస్ వద్ద కూడా ‘ఎం.ఎస్.ధోనీ’ది అదే జోరు..!

3rd, October 2016 - 03:18:07 PM

ms-dhoni
క్రికెట్‌కు కొత్త కళ తీసుకొచ్చి, ఇండియాకు క్రికెట్‌లో తిరుగులేని విజయాలను అందించిన ఎం.ఎస్.ధోని జీవిత కథ ఆధారంగా ఎం.ఎస్.ధోని అన్న సినిమా రూపొందిన విషయం తెలిసిందే. క్రికెట్‌లో తన ఆటతో అభిమానులను ఎలా కట్టిపడేస్తాడో, తన కథతోనూ అభిమానులను అలాగే కట్టిపడేశాడు ధోనీ. ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు నీరజ్ పాండే తెరకెక్కించిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా భారీ ఎత్తున గత శుక్రవారమే విడుదలై సూపర్ హిట్ టాక్‌తో బాక్సాఫీస్ వద్ద వసూళ్ళ వర్షం కురిపిస్తోంది.

విడుదలైన అన్ని భాషల్లోనూ సినిమా మంచి వసూళ్ళు రాబడుతోంది. మూడు రోజుల ఫస్ట్ వీకెండ్‌లో ఈ సినిమా దేశవ్యాప్తంగా 66 కోట్ల రూపాయలు వసూలు చేసింది. ఎక్కువగా సూపర్ స్టార్‌డమ్ ఉన్న హీరోలకు మాత్రమే సాధ్యమయ్యే ఓపెనింగ్స్ ధోనికి రావడం విశేషమనే చెప్పాలి. త్వరలోనే సినిమా వంద కోట్ల మార్క్ చేరుకోనుంది. బాలీవుడ్‌లో హీరోగా ఇప్పుడిప్పుడే గుర్తింపు తెచ్చుకుంటోన్న సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ధోని పాత్రలో అద్భుతంగా నటించి టాప్ స్టార్స్ జాబితాలో చేరిపోయారు. ఇక రానున్న రోజుల్లో దసరా సెలవుల దృష్ట్యా ఎం.ఎస్.ధోని బాక్సాఫీస్ వద్ద ప్రభంజనమే సృష్టించే అవకాశం కనిపిస్తోంది.