కేంద్ర ప్రభుత్వం లాక్ డౌన్ నిబంధనలు సడలించి సినిమా హాళ్లు ఓపెన్ చేసుకోవడానికి అనుమతులు ఇచ్చిన సంగతి తెలిసిందే. దీంతో అన్ని రాష్ట్రాల్లోనూ సినిమా హాళ్లు, మల్టీప్లెక్స్ యాజమాన్యాలు స్క్రీన్స్ ఓపెన్ చేయడానికి సన్నాహాలు చేసుకుంటున్నాయి.
రాష్ట్ర ప్రభుత్వాలతో చర్చలు జరుపుతున్నాయి. ఈ నేపథ్యంలో సినిమా హాళ్లు ఓపెన్ అయిన వెంటనే ఏ చిత్రాలను ప్రదర్శించనున్నారు అనే విషయమై ప్రేక్షకుల్లో సర్వత్రా ఆసక్తి నెలకొంది. లాక్ డౌన్ సమయంలో ఓటీటీల ద్వారా కొన్ని మంచి సినిమాలు బయటికొచ్చాయి. వాటితోనే సినిమా హాళ్లు రీఓపెన్ అవుతాయనే టాక్ ఉంది. ఓటీటీల్లో ఆశించిన ఫలితం రాబట్టుకోలేకపోయిన సినిమాలను ఆయా చిత్రాల నిర్మాతలు థియేటర్లు ఓపెన్ కాగానే రీరిలీజ్ చేస్తారనే టాక్ కూడ ఉంది.
అయితే దేశంలోని ప్రముఖ మల్టీప్లెక్స్ యాజమాన్యాలు మాత్రం ఒకసారి ఓటీటీల ద్వారా బయటికొచ్చిన చిత్రాలను మళ్ళీ ప్రదర్శించకూడదని నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. అలాగే థియేటర్లు క్లోజ్ చేసే సమయానికి ఏ సినిమాలైతే ఆడుతున్నాయో తిరిగి వాటినే ప్రదర్శించడమా లేకపోతే కొత్త సినిమాలు ఏవైనా విడుదలకు సిద్దంగా ఉంటే వాటిని రిలీజ్ చేయడమో జరుగుతుందట. అంతేకానీ ఓటీటీ సినిమాలను మాత్రం రీరిలీజ్ చేయరని తెలుస్తోంది. దీన్నిబట్టి ఓటీటీల ద్వారా అదృష్టాన్ని పరీక్షించుకున్న సినిమాలకు థియేటర్లలోకి వచ్చే ఛాన్స్ లేనట్టే అనిపిస్తోంది.
