మహేష్ సినిమాకు కాస్త బ్రేక్ ఇచ్చిన మురుగదాస్!

murugudas
సూపర్ స్టార్ మహేష్ – దర్శకుడు ఏ.ఆర్.మురుగదాస్‌ల కాంబినేషన్‌లో ఓ భారీ బడ్జెట్ సినిమా ఈ మధ్యే సెట్స్‌పైకి వెళ్ళిన విషయం తెలిసిందే. హైద్రాబాద్‌లో కొద్దిరోజులుగా శరవేగంగా జరుగుతోన్న ఈ సినిమా షెడ్యూల్‌కు కాస్త బ్రేక్ ఇచ్చి, మురుగదాస్ తన హిందీ సినిమా ‘అకిరా’ను విడుదలకు సిద్ధం చేసే పనిలో పడిపోయారు. మురుగదాస్ దర్శకత్వంలో సోనాక్షి సిన్హా హీరోయిన్‍గా ‘అకిరా’ పేరుతో తెరకెక్కిన సినిమా సెప్టెంబర్ 2న ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఇక ఈ సినిమా ఫైనల్ కాపీని సిద్ధం చేసే పనిలో ప్రస్తుతం మురుగదాస్ టీమ్ బిజీ బిజీగా ఉంది. మరోపక్క సోనాక్షి సిన్హా ఇప్పటికే ప్రమోషనల్ కార్యక్రమాలను కూడా వేగవంతం చేశారు. ‘అకిరా’ ఫస్ట్ కాపీ సిద్ధం కాగానే మహేష్ సినిమాను మళ్ళీ మొదలుపెట్టేలా మురుగదాస్ ప్లాన్ చేశారు. ఇలా అటు అకిరా ప్రమోషనల్ పనులను, మహేష్ సినిమా షూటింగ్‌నూ రెండింటినీ పకడ్బందీగా మేనేజ్ చేస్తూ మురుగదాస్ బిజీగా గడిపేస్తున్నారు. తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో తెరకెక్కుతోన్న మహేష్ సినిమాలో రకుల్ ప్రీత్ హీరోయిన్‌గా నటిస్తున్నారు. ఎన్.వి.ప్రసాద్, ఠాగూర్ మధు భారీ ఎత్తున ఈ సినిమాను నిర్మిస్తున్నారు.