సాహితీ హిమాలయం సీతారాముడు – ఇళయరాజా

Published on Dec 1, 2021 10:55 am IST

సిరివెన్నెల సీతారామశాస్త్రి అనారోగ్యం కారణంగా నిన్న సాయంత్రం ఆసుపత్రి లో కన్నుమూశారు. తెలుగు సినీ పరిశ్రమలో దాదాపు 4000 కి పైగా పాటలు, 11 నంది అవార్డులు, 4 ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్ పొందిన పద్మశ్రీ సిరివెన్నెల సీతారామశాస్త్రి గారి మరణం పట్ల విచారం వ్యక్తం చేస్తూ ప్రముఖ సంగీత దర్శకులు ఇళయరాజా కీలక వ్యాఖ్యలు చేశారు.

వ్యాపారాత్మక సినిమా పాటల్లో సైతం కళాత్మకతని, కవితాత్మని అందించి, అందమైన, అర్థవంతమైన,సమర్థవంతమైన పాటలని మన మెదళ్లలో నగంగలా ప్రవహింపచేసిన కవీశ్వరుడు సీతారాముడు. ఎన్నో సంవత్సరాల ప్రయాణం మాది. శ్రీ వేటూరి గారికి సహాయకుడిగా వచ్చి, అతి తక్కువ కాలంలో శిఖర స్థాయికి చేరుకున్న సరస్వతి పుత్రుడు. మా ఇద్దరి కలయికలో ఎన్నో పాటలు ప్రాణం పోసుకున్నాయి. తన పాటల పదముద్రలు నా హార్మోనియం మెట్లపై నాట్యం చేశాయి. రుద్రవీణ, స్వర్ణకమలం, బొబ్బిలిరాజా ఎన్ని సినిమాలు, ఎన్ని పాటలు. రేపు రాబోయే రంగమార్తాండ కూడా. సీతారాముడు రాసిన పాటలకు నువ్వా నేనా అంటూ పోటీపడుతూ సంగీతాన్ని అందించిన సందర్భాలెన్నో. సీతారాముడు పాటతో ప్రయాణం చేస్తాడు. పాటతో అంతర్యుద్ధం చేస్తాడు. పాటలో అంతర్మథనం చెందుతాడు. పాటని ప్రేమిస్తాడు. పాటతో రమిస్తాడు. పాటని శాసిస్తాడు. పాటని పాలిస్తాడు. పాట నిస్తాడు. మన భావుకతకి భాషను అద్ది. మనకు తెల్సిన పాటలా చెవుల్లోకి ఒంపుతాడు. అందుకే సీతారాముడి పాటలు ఎప్పటికీ గుర్తుంటాయి. తన సాహిత్యం నాతో ఆనంద తాండవం చేయించాయి. నాతో శివతాండవం చేయించాయి. వేటూరి నాకు తెలుగు సాహిత్యం మీద ప్రేమను పెంచితే, సీతారాముడు నాకు తెలుగు సాహిత్యం మీద గౌరవాన్ని పెంచాడు. ధన్యోస్మి మిత్రమా. ఇంత త్వరగా సెలవంటూ శివైక్యం చెందడం మనస్సుకు బాధగా ఉంది. పాటకోసమే బ్రతికావు. బ్రతికినంత కాలం పాటలే రాసావు. ఆ ఈశ్వరుడు నీకు సద్గతిని ప్రసాదించాలని కోరుకుంటున్నా అని అన్నారు. ఇళయరాజా రాసిన ఈ లేఖ సోషల్ మీడియా లో వైరల్ గా మారుతోంది.

సంబంధిత సమాచారం :