ఇంటర్వ్యూ : మీనాక్షి దీక్షిత్ – మ్యూజిక్ వీడియో చేయడం ఓ కొత్త అనుభూతి!
Published on Feb 10, 2017 12:00 pm IST


హిందీ, తెలుగు, తమిళ్, మళయాలం, కన్నడ.. ఇలా చాలా సినీ పరిశ్రమల్లో పలు సినిమాల్లో కీలక పాత్రల్లో నటించి మెప్పించిన మీనాక్షి దీక్షిత్, తాజాగా ‘కదిలే కాలం కలలా..’ అనే ఓ మ్యూజిక్ వీడియోతో మెప్పించేందుకు సిద్ధమయ్యారు. బాలీవుడ్‌లో బాగా పాపులర్ అయిన మ్యూజిక్ వీడియో కాన్సెప్ట్ ఇక్కడా ఈ వీడియోతో అదే స్థాయిలో పాపులర్ అవుతుందని దర్శక, నిర్మాతలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఇక ‘దూకుడు’ టైటిల్ సాంగ్‌తోనే తెలుగులో బాగా గుర్తింపు తెచ్చుకున్న మీనాక్షి నటించిన ఈ మ్యూజిక్ వీడియో గురించి ఆమెతో జరిపిన ఇంటర్వ్యూ విశేషాలు..

ప్రశ్న) ‘కదిలే కాలం కలలా..’ అనే మ్యూజిక్ వీడియోతో వస్తున్నారు. ఈ మ్యూజిక్ వీడియో స్పెషాలిటీ ఏంటి?

స) ఈ వాలెంటైన్స్ డేకి మ్యూజిక్ వీడియోను విడుదల చేస్తున్నాం. సాంగ్ చాలా ఎగ్జైటింగ్‌గా ఉంటుంది. రిఫ్రెషింగ్‌గా ఉంటూ, ప్రేమను ఎంతో అందంగా చూపించే మ్యూజిక్ వీడియో ఇది.

ప్రశ్న) ఈ ప్రాజెక్టు ఎలా మొదలైందో చెప్పండి?

స) దర్శకుడు కిరణ్ నాకు బాగా పరిచయం. ఆయన ఈ మ్యూజిక్ వీడియో ఐడియా గురించి చెప్పగానే పాట విని వెంటనే ఒప్పేసుకున్నా. 14 గంటల్లో షూట్ మొత్తం అయిపోయిందంటే ఎంత పక్కాగా ప్రొడక్షన్ ప్లాన్ చేశారో అర్థం చేస్కోవచ్చు.

ప్రశ్న) సినిమాల్లో నటిస్తూ మ్యూజిక్ వీడియో ఎందుకు చేయాలనిపించింది?

స) అసలు సినిమాలతో ఏమాత్రం సంబంధం లేని కుటుంబం నుంచి వచ్చిన నేను, మొదట్లో టీవీ షోస్ చేశా. ఆ తర్వాత మోడలింగ్‌లో పాపులారిటీ సంపాదించా. ఏ భాష అని చూడకుండా అన్ని భాషల సినిమాల్లో నటించా. ఇలా మొదట్నుంచీ కెరీర్ అంతా డిఫరెంట్‌గానే ప్లాన్ చేశా. ఈ మ్యూజిక్ వీడియో ఓ కొత్త ఎక్స్‌పీరియన్స్.

ప్రశ్న) దర్శకుడు కిరణ్ గురించి చెప్పండి?

స) కిరణ్ మంచి ప్రొఫెషనల్. ‘ఈ మ్యూజిక్ వీడియోను 14 గంటల్లో తీస్తాను’ అన్నప్పుడు నేను నమ్మలేదు. ఈ స్థాయి విజువల్స్‌తో 14 గంటల్లో షూట్ ముగించడం చూస్తేనే ఆయనకు క్రాఫ్ట్ మీద ఉన్న పట్టేంటో తెలిసిపోతుంది.

ప్రశ్న) చాలా సినిమాల్లోనే నటించినా, ఇప్పుటికీ దూకుడు టైటిల్ సాంగ్‌తోనే మిమ్మల్ని గుర్తించడం ఎలా చూస్తారు?

స) (నవ్వుతూ..) నిజమే! ఇప్పటికీ దూకుడు టైటిల్ సాంగ్ వల్లే నన్ను తెలుగు ప్రేక్షకులు గుర్తుపడుతూ ఉంటారు. ఆ పాట అంత పెద్ద హిట్ అవ్వడం, నన్ను ఆ విధంగా ప్రేక్షకులు గుర్తుపట్టడం నటిగా అన్ని సంతృప్తినిచ్చేవే. కాకపోతే ఇంకా చాలా సినిమాలు చేశాను కదా అని మాత్రం అనిపిస్తూంటుంది.

ప్రశ్న) ఇండస్ట్రీలో మీరు ఆశించిన స్థాయి గుర్తింపు రాలేదని ఏమైనా భావిస్తున్నారా?

స) అస్సల్లేదు. నేను ఎంచుకున్న దారే అలాంటిది కాబట్టి ఎప్పుడూ అలా భావించలేదు. సౌత్, నార్త్ ఎక్కడికెళ్ళినా నన్ను ప్రేక్షకులు గుర్తుపడుతూ ఉంటారు. అది చాలు ఉత్సాహంగా పనిచేయడానికి.

ప్రశ్న) ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ ఏంటి? ఎలాంటి సినిమాలు చేయాలనుకుంటున్నారు?

స) ప్రస్తుతం బాలీవుడ్‌లో రెండు సినిమాలు చేస్తున్నా. అలాగే తెలుగులోనూ పలు అవకాశాలు వస్తున్నాయి. సైన్ చేశాక వాటి వివరాలు చెబుతా. ఇప్పటికే ‘కదిలే కాలం కలలా..’ రిలీజ్ కోసం వెయిటింగ్!

 
Like us on Facebook