మహేష్, బన్నీ చేసిందే నాగ చైతన్య కూడా చేస్తున్నాడు !


ఇప్పుడు తెలుగు స్టార్ హీరోలు కేవలం తెలుగు మార్కెట్ ను మాత్రమే చూడటం లేదు. దృష్టి కాస్త పెద్దది చేసి సౌత్ ఇండియా మార్కెట్ పై దృష్టి పెట్టారు. అందులో భాగంగా భారీ మార్కెట్ కెపాసిటీ ఉన్న తమిళ పరిశ్రమలో అడుగు పెట్టేందుకు సిద్ధమయ్యారు. తమ సినిమాల్ని అక్కడ డబ్ చేయడం కాకుండా నేరుగా తెలుగుతో పాటే తమిళ భాషలోనూ రూపొందించి రిలీజ్ చేయాలని నిర్ణయించుకున్నారు.

ఇప్పటికే స్టార్ హీరోలు కొందరు ఈ ఉపాయాన్ని ఆచరణలో పెట్టారు కూడా. వాళ్లలో సూపర్ స్టార్ మహేష్ బాబు కారు. ప్రస్తుతం ఆయన మురుగదాస్ తో చేస్తున్న చిత్రాన్ని తెలుగుతో పాటు తమిళంలో కూడా రూపొందిస్తూ రెండింటినీ ఒకేసారి రిలీజ్ చేయాలనుకుంటున్నాడు. అలాగే మరో స్టార్ హీరో అల్లు అర్జున్ సైతం తమిళ దర్శకుడు లింగుస్వామితో ఒక ద్విభాషా చిత్రానికి సైన్ చేసి తమిళంలో తన సత్తా చూపేందుకు సిద్దమవుతున్నాడు.

ఇప్పుడు వీరి దారిలోనే మరో యంగ్ హీరో నాగ చైతన్య కోలీవుడ్ ఎంట్రీకి రెడీ అవుతున్నాడు. ఈ మధ్యే తమిళంలో ‘దురువంగల్ పతిన్నారు’ చిత్రంతో మంచి పేరు తెచ్చుకున్న యువ దర్శకుడు కార్తీక్ నరేన్ త్వరలో హార్రర్ థిల్లర్ జానర్లో ఒక సినిమా చేయనున్నాడు. ఆ సినిమాలో ఉన్న రెండు ప్రధాన పాత్రల్లో చైతన్య ఒక పాత్ర చేస్తున్నాడట. కార్తిక్ చెప్పిన కథ నచ్చి ఈ సినిమాకు ఒకే చెప్పాడట చైతు. జూన్ మధ్య నుండి షూట్ కూడా మొదలవుతుందట. ఇక్కడ విశేషమేమిటంటే ఈ చిత్రంలో చైతన్యతో పాటు అరవిందస్వామి నటించే ఛాన్స్ ఉందట. ఇకపోతే ఈ సినిమా తమిళంతో పాటు తెలుగులో కూడా వస్తుందా రాదా అనేది ఇంకా తేలలేదు.