వచ్చే ఏడాదే నాగ చైతన్య పెళ్ళి!

naga-chatanya-samantha

అక్కినేని ఫ్యామిలీ హీరో నాగ చైతన్య చాలాకాలంగా హీరోయిన్ సమంతతో ప్రేమలో ఉన్న విషయం తెలిసిందే. ఇప్పటికే సమంత కూడా అక్కినేని కుటుంబంతో కలిసిపోయి వారితో కుటుంబ సభ్యురాలిలాగే పార్టీలకు, ఫంక్షన్‌లకు హాజరవుతూ వస్తున్నారు. నాగార్జున కూడా వీరి ప్రేమకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేయడంతో వీరిద్దరి పెళ్ళెప్పుడు జరుగుతుందని కొద్దిరోజులుగా బాగా చర్చ జరుగుతోంది. తాజాగా ఇదే విషయమై చైతన్య ఓ క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. చెన్నైలో నిన్న సాయంత్రం జరిగిన సెలెబ్రిటీ బ్యాడ్మింటన్ లీగ్ లాంచ్‌లో పాల్గొన్న చైతన్యకు పెళ్ళెప్పుడు చేసుకుంటున్నారనే ప్రశ్న ఎదురైంది.

దీనికి ఆయన స్పందిస్తూ.. “పెళ్ళి వచ్చే ఏడాది చేసుకుంటా. అయితే తేదీ ఎప్పుడన్నది మాత్రం ఇంకా ఆలోచించలేదు” అని స్పష్టం చేశారు. ప్రస్తుతం హీరోగా స్టార్ స్టేటస్ సంపాదించే దిశగా చైతన్య అడుగులేస్తున్నారు. ఈ క్రమంలోనే తన కొత్త సినిమాలు ప్రేమమ్, సాహసం శ్వాసగా సాగిపోలపై భారీ ఆశలే పెట్టుకున్నారు. అటు సమంత కూడా తన సినిమాలతో బిజీ కావడంతో వచ్చే ఏడాది పెళ్ళి చేసుకోవాలని ఇద్దరూ నిర్ణయించుకున్నారట.