కొత్త దర్శకుడితో నాగ చైతన్య సినిమా!

7th, February 2017 - 10:28:01 AM


అక్కినేని హీరో నాగ చైతన్య స్టార్ స్టేటస్ సంపాదించే దిశగా కెరీర్‌ను తెలివిగా ప్లాన్ చేసుకుంటూ వెళ్తోన్న విషయం తెలిసిందే. ‘ప్రేమమ్’, ‘సాహసం శ్వాసగా సాగిపో’ సినిమాలతో కెరీర్‌కు బూస్ట్ ఇచ్చే రెండు హిట్స్ కొట్టేసిన ఆయన, తాజాగా కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు. ఇక ఈ సినిమా ఇంకా సెట్స్‌పై ఉండగానే, చైతన్య హీరోగా నటించే మరో సినిమాకు రంగం సిద్ధమైంది. కళ్యాణ్ కృష్ణ సినిమా తర్వాత ప్రముఖ నిర్మాణ సంస్థ వారాహి చలన చిత్రం బ్యానర్‌లో, సాయి కొర్రపాటి నిర్మాణంలో చైతూ సినిమా ఉంటుందని చాలాకాలం క్రితమే అనౌన్స్ అయింది.

ఇక ఈ క్రమంలోనే పలువురు దర్శకులను తెరపైకి తీసుకొచ్చిన వారాహి టీమ్, చివరకు కృష్ణ ఆర్.వీ.మారిముత్తును దర్శకుడిగా ఎంపిక చేసింది. తమిళంలో పలు టాప్ సినిమాలకు డైరెక్షన్ డిపార్ట్‌మెంట్‌లో పనిచేసిన మారిముత్తు, ఈ సినిమాతోనే దర్శకుడిగా పరిచయమవుతున్నారు. నాగ చైతన్య సరసన లావణ్య త్రిపాఠి హీరోయిన్‌గా నటించనున్న ఈ సినిమా సీనియర్ హీరో శ్రీకాంత్ ఓ ప్రధాన పాత్రలో నటించనున్నారు. త్వరలోనే ఈ ప్రాజెక్టు సెట్స్‌పైకి వెళ్ళే సూచనలు కనిపిస్తున్నాయి.