‘సాహసం శ్వాసగా..’కు డేట్ ఫిక్స్ చేసిన గౌతమ్ మీనన్!

30th, October 2016 - 07:17:11 PM

Sahasem-savasaga-sagipo
అక్కినేని నాగ చైతన్య ‘ప్రేమమ్’ సినిమాతో అభిమానులకు మంచి దసరా గిఫ్ట్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఈనెల 7న విడుదలైన ఈ సినిమా చైతూకి సోలో హీరోగా స్టార్ డమ్ తెచ్చిపెట్టింది. ఇక ఇదే ఉత్సాహంతో ఆయన హీరోగా నటించిన ‘సాహసం శ్వాసగా సాగిపో’ అన్న సినిమా కోసం కూడా అభిమానులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ‘ప్రేమమ్’ కంటే ముందే విడుదల కావాల్సిన ఈ సినిమా అనుకోని కారణాల వల్ల వాయిదా పడుతూ ఇప్పటికి అంతా సెట్ చేసుకొని నవంబర్‌లో విడుదలకు సిద్ధమైంది.

తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో తెరకెక్కిన ఈ సినిమా రెండు భాషల్లోనూ నవంబర్ 11న విడుదల కానుంది. తమిళ వర్షన్‌లో శింబు హీరోగా నటించగా, మంజిమా మోహన్ రెండు భాషల్లోనూ హీరోయిన్‌గా నటించారు. గౌతమ్ మీనన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఇప్పటికే టీజర్, ఆడియోతో మంచి అంచనాలను రేకెత్తించింది. ‘ఏమాయ చేశావే’ తర్వాత గౌతమ్ మీనన్ – చైతూ కాంబినేషన్‌లో వస్తోన్న సినిమా కావడం ‘సాహసం శ్వాసగా సాగిపో’కు మొదట్నుంచీ ఓ ప్రత్యేక క్రేజ్ తెచ్చిపెట్టింది.