విడుదల తేదీ : ఏప్రిల్ 17, 2026
123తెలుగు.కామ్ రేటింగ్ : 2/5
నటీనటులు : నాగశౌర్య, విధి యాదవ్, శ్రీదేవి విజయ్ కుమార్, సముద్రఖని, నరేష్, సాయికుమార్, వెన్నెల కిషోర్, బ్రహ్మాజీ, 30 ఇయర్స్ పృథ్వీ తదితరులు
దర్శకుడు : రమేష్
నిర్మాతలు : శ్రీనివాసరావు చింతలపూడి, విజయ కుమార్ చింతలపూడి,
డాక్టర్ అశోక్ కుమార్ చింతలపూడి
సంగీతం : హారిస్ జైరాజ్
ఛాయాగ్రహణం : రసూల్ ఎల్లోర్
ఎడిటింగ్ : కోటగిరి వెంకటేశ్వరరావు
సంబంధిత లింక్స్ : ట్రైలర్
టాలీవుడ్ యువ హీరో నాగ శౌర్య హీరోగా నటించిన లేటెస్ట్ సినిమా బ్యాడ్ బాయ్ కార్తీక్ కూడా ఈ శుక్రవారం థియేటర్స్ లో వచ్చింది. పెద్దగా బజ్ లేకుండానే థియేటర్స్ లో రిలీజ్ కి వచ్చిన ఈ సినిమా ఎలా ఉందో సమీక్షలో చూద్దాం రండి.
కథ:
కార్తీక్ (నాగశౌర్య)కి వైజాగ్ లో లాయర్ గా పని చేసే తన అక్క కస్తూరి (శ్రీదేవి విజయ్‌కుమార్) అంటే ప్రాణం. అయితే బాధ్యత లేకుండా తిరుగుతూ గొడవలు పడే కార్తీక్ ని ఎలాగైనా విదేశాలకు పంపాలని ఆమె అనుకుంటుంది.. కానీ, అక్కను వదిలి వెళ్లడం ఇష్టం లేని కార్తీక్ తన తంటాలు ఏవో పడుతుంటాడు. ఈ క్రమంలో కదిరి ప్రాంతంలోని అమాయక రైతుల భూములను లాక్కునే గోవిందప్ప (మైమ్ గోపి) కి కస్తూరికి నడుమ వైరం ఆమెని గోవిందప్ప చంపే ప్లానింగ్ వరకు వెళుతుంది. మరి ఈ విషయం తాను ప్రాణంగా భావించే తన తమ్ముడికి తెలుస్తుందా? ఆమెని కాపాడుకోడానికి కార్తీక్ ఏం చేసాడు? అనేవి తెలియాలి అంటే ఈ సినిమా చూసి తెలుసుకోవాలి.
ప్లస్ పాయింట్స్:
కొంచెం గ్యాప్ తర్వాత వచ్చిన నాగ శౌర్య తన అక్కను కాపాడుకునే తమ్ముడి పాత్రలో సిన్సియర్‌గా నటించాడు. కథలో అంతబలం లేకపోయినా, తన నటనతో సినిమాను నిలబెట్టే ప్రయత్నం చేస్తూ మంచి హ్యాండ్సమ్ అండ్ స్టైలిష్ స్క్రీన్ ప్రెజెన్స్ తో తాను కనిపించాడు.
అలాగే చాలా కాలం తర్వాత వెండితెరపై కనిపించిన శ్రీదేవి, లాయర్ పాత్రలో హుందాగా నటించారు. తమ్ముడిపై ప్రేమ, భాద్యత ఉన్న అక్కగా మంచి నటన ఆమె కనబరిచారు.
ఇక సినిమాలో ఇంటర్వెల్ బ్లాక్ యాక్షన్ ఫైట్ హైలైట్ అని చెప్పొచ్చు. ‘కదిరి జాతర’ లో ప్లాన్ చేసుకున్న ఈ యాక్షన్ సీక్వెన్స్ మాస్ ఆడియెన్స్ కి నచ్చేలా డిజైన్ చేయడం బాగుంది.
మైనస్ పాయింట్స్:
ఈ సినిమాలో బిగ్గెస్ట్ మైనస్ ఏదన్నా ఉంది అంటే అవుట్ డేటెడ్ కథ మరియు కథనాలే అని చెప్పాలి. చాలా రొటీన్ టెంప్లెట్ ని దర్శకుడు ఈ సినిమా కోసం తీసుకున్నారు. ఇదే కథాంశం, కథనాలతో తెలుగులో ఎన్నో సినిమాలు మనం చూసేసాం.
సో అన్ని చూసి మళ్ళీ ఇది చూస్తే ఒక పరమ రొటీన్ మాస్ ఎమోషనల్ డ్రామాగా ఇది అనిపిస్తుంది. అలానే హీరో హీరోయిన్ లవ్ ట్రాక్ కూడా ఈ సినిమాలో చాలా వీక్ గా ఉంది. అసలు వారి మధ్యలో ప్రేమ ఎప్పుడు పుట్టిందో కూడా అర్ధం కానీ విధంగా వీరి నడుమ సీన్స్ ఉంటాయి.
అంతే కాకుండా ఊరికే ప్లాన్ చేసుకున్న యాక్షన్ పార్ట్ అంతా ఇందులో సెన్స్ లెస్ గా అనిపిస్తుంది. సెకండాఫ్ మొత్తం ఇదే పంథాలో కొనసాగడం ఒక బోరింగ్ ట్రీట్మెంట్ ని అందిస్తుంది. అలానే కొన్ని చోట్ల కామెడీ సీన్స్ కూడా వర్కౌట్ కాలేదు. సాయి కుమార్, వెన్నెల కిషోర్, సముద్రఖని లాంటి నటులు ఉన్నా ఉపయోగం లేకుండా పోయింది.
సాంకేతిక వర్గం:
ఈ సినిమాలో నిర్మాణ విలువలు పర్వాలేదు. హరీష్ జైరాజ్ లాంటి సంగీత దర్శకుడు కూడా ఈ సినిమాలో డిజప్పాయింట్ చేశారు. రసూల్ ఎల్లోర్ సినిమాటోగ్రఫీ యాక్షన్ సీన్స్ లో బాగుంది. ఎడిటింగ్ లో ఇంకా చాలా లోపాలు ఉన్నాయి, సినిమాని సాగదీతగానే కట్ చేశారు.
ఇక దర్శకుడు రమేష్ విషయానికి వస్తే.. ఒక పాత కథను అంతే పాత పద్ధతిలో తెరకెక్కించి నిరాశపరిచారు. చాలా రొటీన్ స్టోరీ లైన్ తీసుకొని ఎక్కడా ఎంగేజింగ్ గా అనిపించకుండా సీన్స్ తో ఒక ఫుల్ లెంగ్త్ సినిమా చేసి డిజప్పాయింట్ చేసారని చెప్పక తప్పదు.
తీర్పు:
ఇక మొత్తంగా చూసుకున్నట్టయితే నాగ శౌర్య నుంచి చాలా గ్యాప్ తర్వాత వచ్చిన ఈ ‘బ్యాడ్ బాయ్ కార్తీక్’ ఒక అవుట్ డేటెడ్ రొటీన్ బోరింగ్ యాక్షన్ డ్రామాగా మిగిలిపోయింది. నాగ శౌర్య తన ఎఫర్ట్స్ పెట్టినప్పటికీ స్క్రిప్ట్, స్క్రీన్ ప్లే లలో బలం లేనప్పుడు తాను అల్టిమేట్ గా తాను చేయడానికి కూడా ఏమీ లేదు. వీటితో ఈ సినిమా నిరుత్సాహపరుస్తుంది.
123telugu.com Rating: 2/5
Reviewed by 123telugu Team
