టాలీవుడ్ ప్రముఖ నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ అయిన దిల్ రాజుకు నైజాం ఏరియాలో గట్టి ఎదురుదెబ్బ తగిలేలా కనిపిస్తోంది. టాలీవుడ్‌లో అత్యంత చురుగ్గా ఉంటూ ఏటా వరుస సినిమాలను నిర్మించే సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ అధినేత సూర్యదేవర నాగవంశీ, తన చిత్రాల డిస్ట్రిబ్యూషన్ బాధ్యతల నుండి దిల్ రాజుకు స్వస్తి పలికి అక్కినేని నాగార్జునకు చెందిన అన్నపూర్ణ స్టూడియోస్‌తో చేతులు కలిపేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. నైజాం పంపిణీ రంగంలోకి అన్నపూర్ణ స్టూడియోస్ ఇటీవలె గ్రాండ్ ఎంట్రీ ఇవ్వడం ఇండస్ట్రీలో చర్చనీయాంశమైంది.
సాధారణంగా నాగవంశీ సినిమాలకు దిల్ రాజు నైజాం పంపిణీదారుడిగా వ్యవహరిస్తుంటారు. వీరిద్దరి మధ్య మంచి స్నేహబంధం కూడా ఉంది. అయితే, మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూటర్స్ రంగంలోకి వచ్చిన తర్వాత నైజాం మార్కెట్ సమీకరణాలు పూర్తిగా మారిపోయాయి. ఇప్పటికే పలువురు నిర్మాతలు మైత్రీ వైపు మొగ్గు చూపగా, ఇప్పుడు నాగవంశీ కూడా పక్కకు తప్పుకోవడం దిల్ రాజు పంపిణీ వ్యాపారానికి పెద్ద దెబ్బ అని చెప్పవచ్చు. దీనికి గల అసలు కారణాలు తెలియనప్పటికీ, ఈ మార్పు టాలీవుడ్ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.
మరోవైపు నిర్మాతగా దిల్ రాజుకు ఇటీవల వరుస పరాజయాలు ఎదురయ్యాయి. దీంతో ఆయన డిస్ట్రిబ్యూషన్ రంగంలో తిరిగి పట్టు సాధించాలని గట్టిగా ప్రయత్నిస్తున్న సమయంలో, సితార వంటి అగ్ర నిర్మాణ సంస్థ దూరమవ్వడం ప్రతికూల అంశమే. దిల్ రాజు మళ్ళీ నాగవంశీతో చర్చలు జరిపి తన వైపు తిప్పుకుంటారో లేక అన్నపూర్ణ స్టూడియోస్ కొత్త శక్తిగా అవతరిస్తుందో చూడాలి.
